Jangaon: ఆరుతడి, ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు కలెక్టర్
Jangaon: జనగామ జిల్లా మల్కాపూర్‌లో విత్తనాల మేళా. వరితో పాటు ఆరుతడి, ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు.
Jangaon: ఆరుతడి, ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు కలెక్టర్
జనగామ: వరి సాగుతో పాటు ఆరుతడి పంటలు కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలి. ఆయిల్ పామ్ సాగుతో దీర్ఘకాలికంగా అధిక లాభాలు రైతులకు అవసరమైన అన్ని సాంకేతిక సేవలు వ్యవసాయ, ఉద్యానవన పశుసంవర్ధక శాఖల ద్వారా అందుబాటులో ఉన్నాయి.
ఆరుతడి పంటల సాగులో ఆదర్శంగా నిలిచిన రైతులను సన్మానించిన కలెక్టర్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎల్‌నీనో కంటింజెన్సీ ప్రణాళికలో భాగంగా రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఆరుతడి కూరగాయల విత్తనాల మేళాలో భాగంగా జిల్లాలోని చిల్పూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలోని రైతు వేదికలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ మార్పులు తక్కువ వర్షపాతం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా ఆరుతడి పంటలను కూడా సాగు చేయాలని సూచించారు.
పంటల వైవిధ్యీకరణ ద్వారా తక్కువ నీటితో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కంది, శనగ పెసర వంటి పప్పుధాన్యాలతో పాటు నువ్వులు వేరుశెనగ వంటి నూనె గింజల పంటలకు కూడా ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తోందని పేర్కొన్నారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయాన్ని అందించే పంట అని తెలిపారు ఈ పంట సాగుకు ప్రభుత్వం వివిధ రకాలుగా 4 సంవత్సరాల పాటు సబ్సిడీ అందిస్తోందని అలాగే ఆయిల్ పామ్ మంజూరు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాల కల్పనను కూడా త్వరితగతిన చేపట్టనున్నట్లు వివరించారు.
రైతులకు పశుగ్రాసం సాగు కు ప్రభుత్వం 75 శాతం వరకు ప్రోత్సాహక సహాయం అందిస్తోందని తెలిపారు. పంటలతో పాటు పశుపోషణను అనుసంధానం చేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. తాము కూడా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయ ఆవరణలో కంది పంటను సాగు చేస్తున్నామని పేర్కొంటూ ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో విశ్వాసం పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సాగుకు సంబంధించిన ఏవైనా సందేహాలు సాంకేతిక సూచనలు లేదా సమస్యలు ఉన్నట్లయితే వ్యవసాయ ఉద్యానవన పశుసంవర్ధక శాఖల అధికారులను సంప్రదించాలని సూచించారు. అదే విధంగా కలెక్టరేట్ లోని టోల్ ఫ్రీ నంబర్ 1800-425-6605కు ఫోన్ చేసి కూడా సాగుకు సంబంధించిన పూర్తి సమాచారం సలహాలు పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరుతడి పంటలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్న ప్రగతిశీల రైతులను కలెక్టర్ మోమెంటోలతో సత్కరించి అభినందించారు. అనంతరం రైతులకు కూరగాయల విత్తనాల సంచులను పంపిణీ చేసి విత్తన మేళాను పరిశీలించారు.
ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతు తన అనుభవాలను పంచుకుంటూ నేను బిల్ల మల్లా రెడ్డి జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతును. 2021-22 సంవత్సరంలో ఆయిల్ ఫెడ్ అధికారులు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించేందుకు ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లారు. అక్కడ ఆయిల్ పామ్ సాగును ప్రత్యక్షంగా పరిశీలించి ఈ పంటపై నమ్మకం ఏర్పడింది.
ఆ తర్వాత 2022లో ఆయిల్ పామ్ మొక్కలను తీసుకొచ్చి నా పొలంలో నాటాను మొదటి నుంచి మంచి ఫలితాలు రావడంతో ఎంతో సంతోషం కలిగింది. మధ్యలో వరి పత్తి పంటలు కూడా సాగు చేశాను కానీ వాటితో ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు దీంతో మళ్లీ ఆయిల్ పామ్ సాగుకే ప్రాధాన్యం ఇచ్చాను.
ప్రస్తుతం నా ఆయిల్ పామ్ తోటకు మూడేళ్లు పూర్తవుతున్నాయి. వచ్చే జనవరిలో పూర్తి స్థాయిలో కోతకు రానుంది మొదట రెండు టన్నుల దిగుబడితో ప్రారంభమైన నా ఈ ప్రయాణం, ఇప్పటివరకు సుమారు 30 టన్నుల దిగుబడికి చేరుకుంది. దీని ద్వారా నాకు సుమారు రూ.6.5 లక్షల వరకు లాభం వచ్చింది.
ఆయిల్ పామ్ సాగులో వర్షాలు ఎక్కువగా పడినా ఎండ తీవ్రంగా ఉన్నా పెద్దగా నష్టపోయే పరిస్థితి ఉండదు మార్కెటింగ్ సౌకర్యం కూడా చాలా బాగుంది. కోత కోసి ఫ్యాక్టరీకి పంపిస్తే వెంటనే తూకం పూర్తవుతుంది. మూడు రోజుల్లోనే డబ్బు నేరుగా నా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
అందువల్ల రైతులందరూ ఆయిల్ పామ్ సాగుతో పాటు అంతర్ పంటలను కూడా సాగు చేస్తే అదనపు ఆదాయం పొందడంతో పాటు ఆర్థికంగా మరింత బలపడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ వ్యవసాయ, ఉద్యానవన పశుసంవర్ధక శాఖల అధికారులు వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




