Jangaon: జనగామలో నవంబర్ 28న నవోదయ పరీక్ష.. 656 మంది అభ్యర్థులు
Jangaon: జనగామ జిల్లాలో నవంబర్ 28న జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష నాలుగు కేంద్రాల్లో నిర్వహణ; 656 మంది అభ్యర్థులు, ఏర్పాట్లపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వివరాలు.
Jangaon: జనగామలో నవంబర్ 28న నవోదయ పరీక్ష.. 656 మంది అభ్యర్థులు
జనగామ: 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్–2027 ఈ నెల 28వ తేదీన (శనివారం) జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని ఘన్‌పూర్ (స్టేషన్) జెడ్పీహెచ్ఎస్ (బాలుర) పాఠశాల, జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ధర్మకంచలో గల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల (బాలుర), కొడకండ్ల మండల పరిధిలో గల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశామని, మొత్తం (656) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
పరీక్ష సమయం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందని, అభ్యర్థులు ఉదయం 11 గంటల లోపు పరీక్ష హాల్లో ఉండాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా 40 నిమిషాల సమయం ఉంటుందని తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, మరుగుదొడ్లు, తదితర మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు బందోబస్తు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాలుగా ఉన్న నాలుగు పాఠశాలలకు నవంబర్ 28న విద్యార్థులకు సెలవు ప్రకటించామని, ఆ రోజు బదులుగా డిసెంబర్ 12న పని దినంగా ఉంటుందని తెలిపారు. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని సూచించారు.




