Kesamudram: కేసముద్రంలో పాపన్న గౌడ్ జయంతి, నేతాజీ వర్ధంతి
Kesamudram: కేసముద్రం వివేకవర్ధిని హైస్కూల్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలు. నివాళులర్పించిన కరస్పాండెంట్.
Kesamudram: కేసముద్రంలో పాపన్న గౌడ్ జయంతి, నేతాజీ వర్ధంతి
కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్లో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ గడ్డపై జన్మించిన గొప్ప యోధుడని, సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడిన ప్రజానాయకుడని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పాపన్న గౌడ్ ధైర్యసాహసాలు నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరించి, స్వాభిమానంతో జీవించాలనే సందేశాన్ని ఆయన జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానాయకుడని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన నేతాజీ త్యాగం, దేశభక్తి ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. “నాకు రక్తం ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్ర్యం తెచ్చిస్తాను” అనే ఆయన పిలుపు దేశ యువతలో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిందని గుర్తు చేశారు. విద్యార్థులు కూడా దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




