Warangal: కెఎమ్‌సిలో వన మహోత్సవంలో ఎమ్మెల్యే నాయిని!

Warangal: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మెగా ప్లాంటేషన్ వన మహోత్సవం. వెయ్యికి పైగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 18 Aug 2026 12:08 PM IST
Warangal
X

Warangal: కెఎమ్‌సిలో వన మహోత్సవంలో ఎమ్మెల్యే నాయిని!

Warangal: కాకతీయ వైద్య కళాశాల, వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో, కళాశాల యాజమాన్యం సహకారంతో కాకతీయ వైద్య కళాశాల ప్రాంగణంలో మెగా ప్లాంటేషన్ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డా.

కస్తూరి శ్రీధర్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, అటవీ శాఖ అధికారులు, కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. మోహన్ దాస్, ప్రొఫెసర్లు, సీనియర్ వైద్యులు, పూర్వ విద్యార్థులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో వెయ్యికి పైగా మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

వృక్షో రక్షతి రక్షితః అనే భావనతో మొక్కలను కాపాడితే అవే మనలను కాపాడతాయని పేర్కొన్నారు. మొక్కలు నాటడం ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతర బాధ్యతగా భావించాలని సూచించారు.

వైద్య విద్యార్థులు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను దత్తత తీసుకుని, దానికి క్రమం తప్పకుండా నీరు పోసి సంరక్షించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. తాము వైద్య కళాశాలలో ఐదేళ్లు చదువు పూర్తి చేసే సమయానికి, తాము దత్తత తీసుకున్న మొక్క కూడా ఐదేళ్ల పాటు పెరిగి పెద్దదిగా మారేలా బాధ్యత తీసుకోవాలని అన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించడంతో పాటు అనేక వ్యాధులను నివారించేందుకు కూడా దోహదపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరించిన అటవీ శాఖ అధికారులు, ముఖ్యంగా ముకుందరెడ్డి, పుల్లశెట్టి, లక్ష్మారెడ్డి తదితరులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

పెద్ద సంఖ్యలో మొక్కలను ఉచితంగా అందించి కార్యక్రమానికి సహకరించిన అటవీ శాఖను అభినందించారు.పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డా. కస్తూరి శ్రీధర్ మాట్లాడుతూ, కాకతీయ వైద్య కళాశాలతో పూర్వ విద్యార్థులకు ఉన్న అనుబంధం, కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలనే బాధ్యతను ఈ కార్యక్రమం ద్వారా చాటుతున్నామని తెలిపారు.

అటవీ శాఖ అధికారులు అందించిన సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉచితంగా పెద్ద సంఖ్యలో మొక్కలను అందించిన అటవీ శాఖ అధికారులకు అభినందనలు తెలియజేశారు.

జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ, కాకతీయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కళాశాలతో ఇంత బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ, కళాశాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. నగరంలో భవిష్యత్తులో బహిరంగ ప్రదేశాలు తగ్గిపోయే పరిస్థితుల్లో కళాశాల ప్రాంగణం నగరానికి కీలకమైన గ్రీన్ లంగ్ స్పేస్‌గా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించి బతికించడం అంతకంటే ముఖ్యమని కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం నాటిన మొక్కలను కనీసం వచ్చే ఏడాది వరకు జాగ్రత్తగా సంరక్షిస్తే వాటి మనుగడ శాతం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించేందుకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు సంబంధిత శాఖలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

కాకతీయ వైద్య కళాశాల వంటి విద్యాసంస్థల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను విద్యార్థులు, కళాశాల యాజమాన్యం తీసుకోవాలని అధికారులు సూచించారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story