Kuravi: కురవి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ
Kuravi: కురవి పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎస్పీ డా. శబరీష్. రికార్డులు పరిశీలన, పెండింగ్ పిటిషన్లు వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశం.
Kuravi: కురవి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ
కురవి: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ సోమవారం కురవి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ గదులు, రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు.
ముందుగా రిసెప్షన్ విభాగాన్ని పరిశీలించిన ఎస్పీ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల పిటిషన్లు, వాటి పరిష్కార స్థితి, పెండింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి, ఎలాంటి అనవసర జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్‌లోని CCTNS 2.0, స్టేషన్ రైటర్ విభాగం, ఇతర రికార్డులు పరిశీలించిన ఎస్పీ, సిబ్బందిని విధులకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నించి వారి పనితీరును సమీక్షించారు. కేసులు, పిటిషన్లు, స్టేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని CCTNS 2.0లో ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేసి అప్‌డేట్ చేయాలని సూచించారు.
సీసీటీవీ కెమెరాల పనితీరు, కవరేజ్, రికార్డింగ్ పరిస్థితిని పరిశీలించి, సీసీటీవీలను నిరంతరం పర్యవేక్షిస్తూ సక్రమంగా పనిచేసేలా చూడాలని సూచించారు. నేరాల నియంత్రణ, నేరాల దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.
అనంతరం జనరల్ డైరీ, స్టేషన్ రికార్డులు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, పాయింట్ బుక్స్ తదితరాలను పరిశీలించారు. అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసి, పూర్తిస్థాయిలో నిర్వహించాలని కురవి ఎస్‌ఐ సతీష్‌కు సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా సమీక్షించిన ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్, కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, బ్లాక్ స్పాట్లు వివరాలను ఎస్‌ఐ సతీష్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచి, వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.
మాదకద్రవ్యాల నియంత్రణపై కూడా ఎస్పీ ప్రత్యేకంగా సమీక్షించారు. గంజాయి బీటర్ల వివరాలను సేకరించి, వారిపై నిరంతరం నిఘా ఉంచాలని, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ (VPOs) ద్వారా గ్రామాల్లో పోలీసుల నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ సూచించారు. VPOలు తమకు కేటాయించిన గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ, గ్రామాల్లోని పరిస్థితులు, నేరాలకు సంబంధించిన సమాచారం, గంజాయి మరియు ఇతర అక్రమ కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరించి పోలీస్ స్టేషన్‌కు అందించాలని తెలిపారు.
గ్రామాల సందర్శనలు, 100 మరియు 112 ద్వారా వచ్చే కాల్స్, ప్రజల పిటిషన్లపై తీసుకుంటున్న చర్యల వివరాలను కూడా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పోలీసుల నిరంతర పర్యటనలు కొనసాగిస్తూ, ప్రజలతో సమన్వయం పెంచుకోవాలని సూచించారు.
ప్రజావాణి పిటిషన్ల విషయంలో ఎలాంటి పెండెన్సీ ఉండకూడదని, ప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలని ఎస్పీ స్పష్టం చేశారు.
ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు సిబ్బంది బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా,నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ సూచించారు.




