Mahabubabad: నీటి సమస్యపై రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో నీటి సమస్యపై విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.
Mahabubabad: నీటి సమస్యపై రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌లోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమను వేధిస్తున్న నీటి సమస్యను పరిష్కరించాలంటూ పాఠశాల విద్యార్థినులు గురువారం ఉదయం రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. రహదారిపై బైఠాయించి, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
నెల రోజులుగా నరకం.. వాష్ రూమ్‌లకు వెళ్లడానికీ నీరు లేదు
గత నెల రోజులుగా పాఠశాలలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, దీనివల్ల తాము అతలాకుతలం అవుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం లేచినప్పటి నుండి కనీసం వాష్ రూమ్‌లకు వెళ్లడానికి కూడా నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కన్నీరుమున్నీరయ్యారు.
బాత్రూమ్‌లను శుభ్రం చేయడానికి సైతం నీటి వసతి కల్పించకుండా గురుకుల పాఠశాల యజమాన్యం తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విద్యార్థినులు ఆరోపించారు.
డబ్బులు ఇస్తేనే రిపేర్.. ఉపాధ్యాయుల వేధింపులు?
పాఠశాలలో నెలకొన్న సమస్యను ప్రిన్సిపాల్ (HM) దృష్టికి తీసుకెళ్తే.. "తలా పది రూపాయలు వసూలు చేసి ఇస్తేనే మోటార్ లేదా పైప్‌లైన్ రిపేర్ చేయిస్తాం" అని బాధ్యతారహితంగా సమాధానం ఇస్తున్నారని విద్యార్థినులు వాపోయారు. దీనికి తోడు సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకు పాఠశాల ఉపాధ్యాయులు తమను మానసికంగా వేధిస్తున్నారని వారు సంచలన ఆరోపణలు చేశారు.
విద్యార్థినుల డిమాండ్:
"కనీస అవసరాల కోసం నీరు లేక మేము నరకం చూస్తున్నాం. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మా గురుకుల పాఠశాలలో నీటి వసతి కల్పించాలి. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి."
రోడ్డుపై విద్యార్థినుల ధర్నాతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులతో చర్చలు జరుపుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.




