Mahabubabad: గూడూరులో నామమాత్రంగా మారుతున్న ప్రజావాణి కార్యక్రమం!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గూడూరులో నామమాత్రంగా మారుతున్న ప్రజావాణి కార్యక్రమం.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు.
Mahabubabad: గూడూరులో నామమాత్రంగా మారుతున్న ప్రజావాణి కార్యక్రమం!
Mahabubabad: గూడూరు మండల ప్రజా పరిషత్ (ఎంపీడీఓ) కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ (ప్రజా ఫిర్యాదుల విభాగం) కార్యక్రమం నామమాత్రంగా మారుతోందని స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే, అధికారులు మాత్రం దీనికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజావాణికి ప్రధాన శాఖలకు చెందిన అధికారులు గైర్హాజరు కావడం పరిపాటిగా మారింది. ఒకవేళ వచ్చిన కొద్దిమంది అధికారులు కూడా కేవలం హాజరు నమోదు కోసం, ఫోటోలు దిగి, సెల్ ఫోన్ చూడడానికే పరిమితమవుతున్నారని మండల వాసులు ఆరోపిస్తున్నారు. ఫోటోలు దిగిన వెంటనే ‘శాఖాపరమైన అత్యవసర పనులు ఉన్నాయంటూ’ సాకులు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారని మండిపడుతున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం ఆశగా వచ్చే అర్జీదారులకు అధికారుల వ్యవహార శైలి తీవ్ర నిరాశను మిగులుస్తోంది. గంటల తరబడి వేచి చూసినా సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోక ప్రజావాణి ఉద్దేశమే దెబ్బతింటోందని వాపోతున్నారు.
ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రజావాణికి ముఖం చాటేస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని గూడూరు మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.




