Mahabubabad: గూడూరు మండలంలో అదుపుతప్పిన కారు బీభత్సం
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగుండ వద్ద జాతీయ రహదారిపై ఘోర కారు ప్రమాదం జరిగింది.
Mahabubabad: గూడూరు మండలంలో అదుపుతప్పిన కారు బీభత్సం
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగుండ గ్రామంలో జాతీయ ప్రధాన రహదారిపై తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న ఒక కారు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. అంతటితో ఆగకుండా ఆ కారు పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి, రహదారి పక్కనే ఉన్న పాడి గేదెలపైకి బలంగా దూసుకెళ్లింది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఖమ్మం నుంచి మేడారం వెళ్తున్న వారు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ కారులో ఇద్దరు చిన్నారులు ఉండడం గమనార్హం. ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు కావడంతో చిన్నారులు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి క్షతగాత్రులను 108 ద్వారా ఖమ్మం హాస్పటల్ కు తరలించారు.
జీవనాధారం కోల్పోయిన రైతు
ఈ ప్రమాద తీవ్రతకు నాలుగు పాడి గేదెలకు తీవ్ర గాయాలు కాగా, మరో రెండు పాడి గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ప్రమాద సమాచారం అందుకున్న పాడి గేదెల యజమాని వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని, మృతి చెందిన తన గేదెలను చూసి కన్నీరుమున్నీరయ్యారు.
ఈ పాడి గేదెలే మా కుటుంబానికి ఏకైక జీవనాధారం. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే మా ఇల్లు గడిచేది. ఇప్పుడు గేదెలు మృతి చెందడంతో నా ఉపాధి పూర్తిగా దెబ్బతింది, జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డాను అని బాధితుడు వెంకటేశ్వర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాధితుడికి ప్రభుత్వం సంబంధిత అధికారులు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.




