Mahabubabad: తునికి ఆకు సేకరణ కోసం అడవికి వెళ్ళిన మహిళ పాముకాటు తో మృతి

Mahabubabad: అడవిలో ఆకు తెంపుతుండగా కాటేసిన కాలసర్పం. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబంలో తీవ్ర విషాదం.

B NARASIMHA, GUDUR
Published on: 23 May 2026 1:38 PM IST
Mahabubabad
X

Mahabubabad: తునికి ఆకు సేకరణ కోసం అడవికి వెళ్ళిన మహిళ పాముకాటు తో మృతి

కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తునికాకు సేకరణ కోసం అడవికి వెళ్లిన ఓ మహిళా కూలి పాము కాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన ఈ ఘటన కొత్తగూడ మండలం కర్ణగండి గ్రామంలో చోటుచేసుకోగా, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొత్తగూడ మండలం కర్ణగండి గ్రామానికి చెందిన మద్దెల పల్లవి, ఆమె భర్త సారయ్యతో కలిసి గురువారం తునికాకు సేకరణ కోసం సమీప అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఆకు తెంపుతున్న సమయంలో అనుకోకుండా ఓ విషసర్పం పల్లవిని కాటు వేసింది.

పాము కాటు వేసిన విషయం గమనించిన భర్త సారయ్య, తోటి కూలీల సహాయంతో వెంటనే ఆమెను కొత్తగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఎంజీఎం ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న పల్లవి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. పల్లవి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తునికాకు సేకరణ ద్వారా జీవనోపాధి పొందుతున్న పేద కుటుంబానికి చెందిన పల్లవి మృతి చెందడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబంలో జరిగిన ఈ విషాదం స్థానికులను కలచివేసింది. తునికాకు సేకరణ కోసం అడవులకు వెళ్లే కూలీల భద్రతపై మరింత శ్రద్ధ అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story