Mulugu: ములుగులో మహిళా సంఘాలకు రూ.22.50 కోట్ల బ్యాంక్ రుణాలు: మంత్రి!

Mulugu: ములుగులో 265 మహిళా సంఘాలకు రూ.22.50 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణ చెక్కులను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. వడ్డీ లేని రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపుపై హర్షం.

PONNALA SWAMY, MULUGU
Published on: 17 Sept 2026 4:21 PM IST
Mulugu
X

Mulugu: ములుగులో మహిళా సంఘాలకు రూ.22.50 కోట్ల బ్యాంక్ రుణాలు: మంత్రి!

ములుగు: మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి‌ దనసరి అనసూయ సీతక్క అన్నారు.

గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా ములుగు జిల్లాలోని 265 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా మంజూరైన 22 కోట్ల 50 లక్షల రుణాలకు సంబంధించిన చెక్కులను జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌లతో కలిసి మంత్రి అనసూయ సీతక్క మహిళా సంఘాల లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ఒక్కో స్వయం సహాయక సంఘానికి 20 లక్షల వరకు బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

మహిళా సంఘాలకు అందించే వడ్డీ లేని రుణ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. మహిళలు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులు, తమ నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి కార్యక్రమాలను చేపట్టి ఆదాయాన్ని పెంపొందించుకోవాలన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణ, ఆర్థిక సహకారం, ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అనంతరం వేడుకల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇప్ప పువ్వు లడ్డు స్టాల్ ను మంత్రి అనసూయ సీతక్క పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్‌ మహేందర్‌ జి, సంపత్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బానోతు రవిచందర్‌, అదనపు ఎస్పీ, ఆర్డీఓ కృష్ణవేణి, జిల్లా రెవెన్యూ అధికారి, మున్సిపాల్ వైస్‌ చైర్మన్‌, పంచాయతీరాజ్‌ శాఖ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్‌, ఏ పీ డి శ్రీనివాస్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, గ్రామ సంఘ సహాయకులు, గ్రామ సంఘాల అధ్యక్షులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, వయోవృద్ధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU