Mulugu: తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు జీవితాన్ని ఇస్తారు: మంత్రి!

Mulugu: ములుగు కలెక్టరేట్‌లో ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి సీతక్క సత్కరించారు. మార్కులతో జీవితాన్ని ముడిపెట్టొద్దని, పాఠశాలల సమస్యలపై త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ తెస్తామన్నారు.

PONNALA SWAMY, MULUGU
Published on: 17 Sept 2026 4:24 PM IST
Mulugu
X

Mulugu: తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు జీవితాన్ని ఇస్తారు: మంత్రి!

ములుగు జిల్లా: తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే, గురువులు వారికి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.

గురువారం నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గురుపూజోత్సవం, 2026 సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ లతో కలిసి మంత్రి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి అత్యంత గౌరవప్రదమైన స్థానం ఉందన్నారు. ఒక ఉపాధ్యాయుడు తీర్చిదిద్దితేనే విద్యార్థులు కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, శాస్త్రవేత్తలుగా ఎదగగలుగుతారని తెలిపారు. జీవితంలో ఆకాశమే హద్దుగా ఎదిగిన ప్రతి వ్యక్తి విజయం వెనుక గురువు బోధన, మార్గదర్శనం తప్పనిసరిగా ఉంటాయని పేర్కొన్నారు. గురువును మించిన శిష్యుడు ఎదగవచ్చేమోగానీ, గురువుకు సమాజంలో ఉన్న గౌరవాన్ని, మర్యాదను, చరిత్రను ఎవరూ చెరిపివేయలేరని స్పష్టం చేశారు.

విద్యార్థులపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ అభిరుచులను బలవంతంగా రుద్దకుండా, వారిలోని ఆసక్తి, సృజనాత్మకత, ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. మార్కులతో విద్యార్థుల జీవితాలను ముడిపెట్టి వారిపై అనవసరమైన ఒత్తిడి తీసుకురావద్దన్నారు. విద్యార్థులు ఏ రంగంపై ఆసక్తి చూపుతున్నారో గుర్తించి, ఆ రంగంలోనే ఉన్నతంగా రాణించేలా సరైన మార్గనిర్దేశం చేయాలని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఆలోచనలను అర్థం చేసుకొని, వారికి నచ్చిన మార్గంలో ముందుకు నడిపిస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.

పరీక్షల్లో వంద మార్కులు సాధించడమే విద్యకు పరమార్థం కాదని, చదువుతోపాటు సంస్కారం, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను నేర్పినప్పుడే విద్యకు సంపూర్ణత చేకూరుతుందని మంత్రి తెలిపారు. గురువులను, తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం, ఎదుటివారికి చేతులు జోడించి నమస్కరించడం మన సంస్కారమనే విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలన్నారు. శ్రమను గౌరవించడం, సొంత పనులు చేసుకోవడం, సమాజానికి తమ వంతు సేవ చేయడం వంటి లక్షణాలను చిన్నతనం నుంచే అలవర్చాలని సూచించారు. ప్రతి రోజూ పాఠ్యాంశాలతోపాటు ఒక మంచి మాటను, కొత్త విషయాన్ని విద్యార్థులకు బోధిస్తే, అది వారి మనసుల్లో నిలిచిపోయి జీవితాంతం వారికి మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు.

“మెదడుకు మేత ఉండాలి శరీరానికి శ్రమ ఉండాలి” అనే భావనతో విద్యార్థులను మానసికంగా దృఢంగా, శారీరకంగా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని మంత్రి అన్నారు. విద్యార్థులతో శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు వ్యవసాయం, కూరగాయల సాగు, ప్రకృతి, గ్రామీణ జీవన విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించాలని సూచించారు. చిన్నపాటి సమస్యలకే కుంగిపోకుండా, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని వారిలో పెంపొందించాలన్నారు. విద్యార్థులను సున్నితంగా పెంచకుండా చదువు, క్రీడలు, శారీరక శ్రమలో భాగస్వాములను చేయాలని తెలిపారు.

జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చేందుకు త్వరలో టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాలలు, మండలాలు, జిల్లా విద్యాభివృద్ధికి ఉపయోగపడే వినూత్న ఆలోచనలు, సూచనలను ఉపాధ్యాయులు జిల్లా యంత్రాంగంతో పంచుకోవాలని కోరారు. ఉత్తమ ఆలోచనలను స్వాగతించాలని, అమలుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు.

జిల్లాలోని నిరుద్యోగ యువతకు పోలీసు ఉద్యోగాల కోసం సుమారు 250 మందికి ఉచిత శిక్షణ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రైవేటు శిక్షణ కేంద్రాలకు వెళ్లలేని యువతకు జిల్లాలోనే మెరుగైన శిక్షణ అందిస్తున్నామన్నారు. ఉద్యోగ మేళాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా యువత జీవితంలో స్థిరపడేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ మంత్రి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసేది ఉపాధ్యాయులేనని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారి ఆసక్తులకు అనుగుణంగా ప్రోత్సహిస్తూ ఉన్నత లక్ష్యాలవైపు నడిపించాలని సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణ, సమయపాలన, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవరచుకునేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలన్నారు.

ఉపాధ్యాయుల సమీష్టి కృషితో ములుగు జిల్లా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న విద్యా సంవత్సరంలోనూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచి, ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదిగేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లాలో విద్యాభివృద్ధికి విశేష కృషిచేసి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని మంత్రి దనసరి అనసూయ సీతక్క శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థలు. సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోతు రవిచందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్‌ డైరెక్టర్లు బైరెడ్డి భగవాన్‌రెడ్డి, గుమ్మడి సోమయ్య, మున్సిపాల్ వైస్‌ చైర్‌పర్సన్‌ ఆసియా షాహిన్‌, జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. సిద్ధార్థరెడ్డి, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU