Mulugu: సెప్టెంబర్ 17 పోరాట స్ఫూర్తే ప్రజా ప్రభుత్వానికి మార్గదర్శకం: మంత్రి సీతక్క!

Mulugu: ములుగు కలెక్టరేట్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రగతి, సంక్షేమ పథకాల నివేదికను వెల్లడించారు.

PONNALA SWAMY, MULUGU
Published on: 17 Sept 2026 4:19 PM IST
Mulugu
X

Mulugu: సెప్టెంబర్ 17 పోరాట స్ఫూర్తే ప్రజా ప్రభుత్వానికి మార్గదర్శకం: మంత్రి సీతక్క!

ములుగు: తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్‌ 17 మహోన్నత ఘట్టమని, నాటి పోరాట స్ఫూర్తి ప్రజాపాలనకు మార్గదర్శకమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి‌ దనసరి అనసూయ సీతక్క అన్నారు.

గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లా ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, సెప్టెంబర్‌ 17వ తేదీకి భారతదేశ, తెలంగాణ చరిత్రలో విశిష్టమైన స్థానం ఉందన్నారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, నాటి హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కాలేదని తెలిపారు. నిరంకుశ పాలనతోపాటు రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాడారని గుర్తుచేశారు. రైతులు, కూలీలు, మహిళలు, విద్యార్థులు, యువత ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని చాటిన ఈ చారిత్రక సందర్భాన్ని ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. నాటి పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే వారికి అందించే నిజమైన నివాళి అని తెలిపారు.

ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటికి తక్షణ పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడంతోపాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తు, రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌, సన్నబియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతుల సంక్షేమం, మహిళల ఆర్థికాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, సాగునీటి సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు.

ములుగు జిల్లాలో మొదటి విడతలో 5,201 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, 4,979 ఇండ్లకు మార్కింగ్‌ పూర్తి చేసి, 1,850 ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. రెండో విడతలో మరో 2 వేల ఇండ్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గుడిసెలు లేని ములుగు జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిజమైన అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించనున్నట్లు తెలిపారు.

మహాలక్ష్మి పథకం ప్రారంభమైన నాటి నుంచి జిల్లాలో 2 కోట్ల 33 లక్షల 89 వేల 601 మంది మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించారని, తద్వారా రూ.172 కోట్ల 6 లక్షలు ఆదా చేసుకున్నారని వివరించారు. మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబనకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

జిల్లాలో జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. ములుగు జిల్లా అభివృద్ధి ప్రస్థానంలో ఘట్టమ్మ వద్ద నిర్మించిన పైలాన్‌ ప్రాజెక్ట్‌ కలికితురాయిగా నిలిచిందన్నారు. నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం అందుబాటులోకి రావడంతో ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకేచోట సులభంగా లభిస్తున్నాయని తెలిపారు.

ఏజెన్సీ, మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని మంత్రి వెల్లడించారు. విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరచడంతోపాటు అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ స్ఫూర్తితో అధికారులు మరింత అంకితభావంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములై జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ, రెవెన్యూ డివిజనల్‌ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బానోతు రవిచందర్‌, పంచాయతీరాజ్‌ శాఖ డైరెక్టర్లు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు, వయోవృద్ధులు, విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU