Hanamkonda: నూతన బస్‌స్టేషన్, ఎక్స్‌ప్రెస్ నిలుపుదలకు మంత్రి హామీ!

Hanamkonda: గట్ల నర్సింగాపూర్‌లో నూతన బస్‌స్టేషన్, ఏఎన్ఎం నియామకం చేపడతామని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్.

Narender, Staff Reporter  -Warangal
Published on: 30 Aug 2026 7:53 PM IST
Hanamkonda
X

Hanamkonda: నూతన బస్‌స్టేషన్, ఎక్స్‌ప్రెస్ నిలుపుదలకు మంత్రి హామీ!

Hanamkonda: హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలో నిర్వహిస్తున్న “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా గట్ల నర్సింగాపూర్ గ్రామంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల సమక్షంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, పలువురు వినతిపత్రాలు అందజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి మంత్రి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.

వారం రోజుల్లో ఏఎన్ఎం నియామకం

గట్ల నర్సింగాపూర్ గ్రామంలో 2021 నుంచి ఏఎన్ఎం పోస్టు ఖాళీగా ఉందని గ్రామస్థులు మంత్రి దృష్టికి తీసుకురాగా, వారం రోజుల్లో ఏఎన్ఎంను నియమించాలని డీఎంహెచ్‌ఓను మంత్రి ఆదేశించారు.

గ్రామంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు మ్యాజిక్ ఫిట్ గుంతలు ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థల సేకరణ జరిగితే గ్రామానికి వీఓ భవనం మంజూరు చేస్తామని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న వెటర్నరీ ఆసుపత్రికి మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు.

గ్రామంలో శాశ్వత జీపీఓ నియామకం, స్మశానవాటిక రహదారి, కల్వర్టు నిర్మాణం, అంతర్గత సీసీ రోడ్లు, సోలార్ స్ట్రీట్ లైట్లు తదితర సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.

బస్ స్టేషన్‌కు నూతన భవనం.. ఎక్స్‌ప్రెస్ బస్ హాల్టింగ్

గట్ల నర్సింగాపూర్‌లో శిథిలావస్థలో ఉన్న బస్ స్టేషన్ స్థానంలో నూతన బస్ స్టేషన్ మంజూరు చేసి పనులు వెంటనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు గట్ల నర్సింగాపూర్‌ స్టేజి వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులకు ఆగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందిస్తామని, ప్రాజెక్టు కాలువల కోసం భూసేకరణకు రైతులు సహకరించాలని మంత్రి కోరారు. భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం పరిహారం అందిస్తోందని తెలిపారు.

ప్రజా పాలనలో గట్ల నర్సింగాపూర్‌కు భారీగా సంక్షేమం

ప్రజా పాలన ప్రభుత్వంలో గట్ల నర్సింగాపూర్ గ్రామానికి అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలితాలను మంత్రి వివరించారు. 27 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలో రెండో దశలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయి. 612 చేయూత పెన్షన్లకు రూ.1.58 కోట్లు విడుదల చేస్తున్నారు. గృహజ్యోతి పథకం కింద 735 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా రూ.1.76 కోట్ల లబ్ధి చేకూరింది.

మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ కింద 655 కుటుంబాలకు రూ.5.25 లక్షలు విడుదలయ్యాయి. 79 మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలుగా రూ.25.95 లక్షలు అందించారు. 12 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.3.90 కోట్లు రుణాలు అందించారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మూడు మహిళా సంఘాలకు 300 స్టీల్ బ్యాంక్ కిట్లు, ఒక్కో కిట్‌లో 13 రకాల వస్తువులు అందించారు. 973 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందించారు. 170 మంది రైతులకు రూ.1.45 కోట్ల రైతు రుణమాఫీ జరిగింది. 828 మంది రైతులకు రైతు భరోసా నిధులు అందాయి.

రైతు బీమా కింద 12 మంది రైతులకు సంబంధించిన కుటుంబాలకు రూ.60 లక్షల పరిహారం అందించారు. 21 మంది రైతులకు సన్న వడ్ల బోనస్ కింద రూ.4.78 లక్షలు విడుదలయ్యాయి. 106 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందించారు. 210 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. రేషన్ కార్డుల్లో 270 కొత్త పేర్లను నమోదు చేశారు. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు.

అభివృద్ధి పనులకు ప్రాధాన్యత

గట్ల నర్సింగాపూర్ నుంచి బొల్లోనిపల్లి వరకు రూ.1.70 కోట్లతో బీటీ రోడ్డు అభివృద్ధి చేశారు. పెద్ద చెరువు అభివృద్ధికి రూ.6.75 లక్షలు, గ్రామ అంతర్గత సీసీ రోడ్లకు రూ.16 లక్షలు వెచ్చించారు. మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరా కోసం బోర్‌వెల్, పంపుసెట్, అంగన్వాడీ భవనాలకు వాటర్ పైప్‌లైన్ అభివృద్ధికి రూ.8 లక్షలు ఖర్చు చేశారు. రూ.12 లక్షలతో నూతన అంగన్వాడీ భవనం మంజూరు చేశారు.

జలసిరి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రైతులు ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించుకోవాలని కోరారు. జలసిరి పథకం కింద ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే ఒక్కో గుంతకు రూ.6,500, పొలం కుంటకు రూ.1.30 లక్షల వరకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు.

ప్లాస్టిక్‌కు దూరంగా.. స్టీల్ బ్యాంక్‌కు ప్రాధాన్యత

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్టీల్ బ్యాంక్‌లను వినియోగించాలని మంత్రి సూచించారు. గట్ల నర్సింగాపూర్‌లో మూడు మహిళా సంఘాలకు 900 స్టీల్ బ్యాంక్ కిట్లు అందించినట్లు తెలిపారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

పెన్షన్ల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తులు

కొత్త పెన్షన్ల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు, తలసేమియా, హెచ్‌ఐవీ బాధితులు తదితర అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

14–15 సంవత్సరాల వయసు గల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణకు అందుబాటులో ఉన్న టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ సేవలను వినియోగించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

విద్య, క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. గట్ల నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాలకు పెయింటింగ్ వేయడంతో పాటు అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.

యువత మొబైల్ ఫోన్లకు బానిసలు కాకుండా క్రీడా మైదానాలకు వెళ్లాలని మంత్రి సూచించారు. నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో క్రీడా సామగ్రిని అందిస్తున్నామని, గట్ల నర్సింగాపూర్‌లో క్రికెట్, వాలీబాల్ తదితర క్రీడా సామగ్రితో పాటు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

క్రీడల్లో రాణిస్తే మంచి గుర్తింపుతో పాటు క్రీడా సర్టిఫికెట్ల ద్వారా ఆర్మీ, పోలీస్ తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి అన్నారు. హుస్నాబాద్ మినీ స్టేడియంలో కబడ్డీ అకాడమీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రాజకీయం వేరు.. అభివృద్ధి వేరు

“రాజకీయం వేరు.. అభివృద్ధి వేరు. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే నియోజకవర్గం సమగ్రంగా అభివృద్ధి చెందినట్లవుతుంది. పెద్ద గ్రామమైన గట్ల నర్సింగాపూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం” అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

గ్రామ సర్పంచ్ బొల్లంపల్లి అజయ్ తీసుకొచ్చిన ప్రతి సమస్యను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి సత్యనారాయణ రెడ్డి, ఉద్యానవన అధికారి కమలాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బొల్లంపల్లి అజయ్, జిల్లా, మండల స్థాయి అధికారులు, గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story