Mulugu: ములుగు పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు!
Mulugu: ములుగులో రూ.5.95 కోట్లతో నిర్మించిన ఈస్ట్ రోడ్డును ప్రారంభించిన మంత్రి సీతక్క. పట్టణంలో రూ.15 కోట్లతో అథ్లెటిక్ స్టేడియం ఏర్పాటుకు ప్రతిపాదనలు.
Mulugu: ములుగు పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు!
Mulugu: ములుగు పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.
బుధవారం ములుగు మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు లక్ష్మీనగర్‌లో 5.95 కోట్ల పంచాయతీరాజ్ శాఖ నిధులతో నిర్మించిన ఈస్ట్ రోడ్డును జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు పట్టణ విస్తరణకు అనుగుణంగా రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. బృందావనం కాలనీ, లక్ష్మీనగర్ కాలనీల్లో నివాసాలు విస్తరించడంతో స్థానికుల రాకపోకలకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. గతంలో మంజూరైన రహదారి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు.
ములుగు గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో మంజూరైన అభివృద్ధి పనులతోపాటు మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత పెరిగిన అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో అవసరమైన రహదారులు, మురుగునీటి కాలువలు, తాగునీటి సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
ములుగు మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి ట్యాంకులు, తోపుకుంట మినీ ట్యాంక్‌బండ్, అంతర్గత రహదారులు, స్మశానవాటిక అభివృద్ధికి మున్సిపల్ పాలకవర్గం సమర్పించిన వినతులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆయా పనులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు.
ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి వివిధ శాఖల సమన్వయంతో నిరంతరం పనులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. మంజూరైన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంతోపాటు కొత్తగా అవసరమైన పనులకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించి ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ములుగులో 15 కోట్లతో అథ్లెటిక్ స్టేడియం ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు మంత్రి తెలిపారు. నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ఇటీవల ప్రారంభించుకున్నామని, జిల్లా ఎస్పీ కార్యాలయ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ములుగు పరిసర ప్రాంతాల్లో పర్యాటక సదుపాయాలను విస్తరించేందుకు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పరిసరాల్లో పర్యాటకులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
మల్లూరు క్షేత్ర అభివృద్ధికి చేపట్టాల్సిన పనులను నిర్మాణ నిపుణులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర అంచనాలు రూపొందించనున్నట్లు చెప్పారు. అవసరమైన మిగతా పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు.
మేడారం సమ్మక్క–సారలమ్మ క్షేత్ర పరిసరాల్లో భక్తులు, స్థానికులకు మెరుగైన సేవలు అందించేందుకు 30 పడకల ఆసుపత్రి, రహదారులు–భవనాల శాఖ అతిథిగృహం, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జాతర ప్రాధాన్యం, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
మారుమూల గ్రామాలకు అనుసంధాన రహదారులు, గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీటి సదుపాయాలు, నీటి ట్యాంకుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా, తాగునీటి వసతులు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రైతుల ధాన్యం నిల్వ సమస్య పరిష్కారానికి ప్రతి మండలంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో గోదాం నిర్మించేందుకు వ్యవసాయ శాఖకు నివేదికలు సమర్పించినట్లు వెల్లడించారు. ప్రతిపాదనల పరిశీలన అనంతరం గోదాముల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులపై సూచనలు, సలహాలు అందించాలని తెలిపారు. మంజూరైన పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ బానోత్ రవిచందర్, స్థానిక కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




