Mulugu: మేడారంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష!
Mulugu: ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా మేడారంలో అభివృద్ధి పనులు, ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలిచ్చారు.
Mulugu: మేడారంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష!
Mulugu: మేడారం ఆలయంలో చేపట్టిన తుది దశ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు.
సోమవారం తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క–సారలమ్మ వనదేవతలను మంత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మేడారంలో చేపడుతున్న ఏర్పాట్లను, ఆలయ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న పీటీ బీమ్స్, క్యూ లైన్లు, మీడియా టవర్లు, గ్రానైట్ పనులను పరిశీలించిన మంత్రి, వాటి పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రాంగణం వెనుక భాగంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్‌కు సంబంధించిన స్థలాన్ని పరిశీలించి, భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఈవో కార్యాలయ పరిసరాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి 16వ తేదీన పర్యటించనున్న సందర్భంగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా నిర్వర్తించాలని, క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, డీపీఓ వెంకయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆలయ ఈవో, సంబంధిత జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




