Warangal: అలీబాబా దొంగల ముఠా లాగా దోచుకున్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే
Warangal: కూడా (KUDA) భూముల వేలంలో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణలను వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ సవాల్ విసిరారు.
Warangal: అలీబాబా దొంగల ముఠా లాగా దోచుకున్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే
వరంగల్: కూడా (KUDA) భూముల వేలంలో అవినీతి జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే, మాజీ KUDA చైర్మన్ ఈ రోజు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్‌లో మీడియా ముందుకు వచ్చే ధైర్యం లేక హైదరాబాద్‌లో దాక్కొని ప్రెస్‌మీట్ పెట్టడం మాజీ ఎమ్మెల్యే దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. నిజంగా ఆరోపణల్లో నిజం ఉంటే హనుమకొండలో ప్రజల మధ్య నిలబడి మాట్లాడాలని, ప్రజలను వదిలేసి హైదరాబాద్‌లో రాజకీయ నాటకాలు ఆడడం హాస్యాస్పదమని విమర్శించారు.
కూడా భూముల వేలం పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్వహించామని, వేలంలో పాల్గొనే అవకాశం అందరికీ కల్పించామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వేలంలో పాల్గొనకుండా ఇప్పుడు అవినీతి జరిగిందని అబద్ధాలు ప్రచారం చేయడం రాజకీయంగా మనుగడ కోసం చేస్తున్న చవకబారు ప్రయత్నమని అన్నారు.
హనుమాన్ టెంపుల్ సమీపంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, అక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ అభివృద్ధి కోసం సాఫ్ట్‌వేర్ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు, స్టార్ హోటళ్లను ఆహ్వానించినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని వివరించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వరంగల్‌ను భూ కబ్జాలు, అక్రమాలు, దోపిడీలు, గుండాయిజంతో అతలాకుతలం చేసిన నాయకులు ఇప్పుడు నీతి, నిజాయితీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల ఆస్తులను దోచుకున్న వారు ఇప్పుడు అవినీతి గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ప్రజలు చూస్తున్నారని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యేకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో జరిగిన భూ కేటాయింపులు, జీఓల దుర్వినియోగం, ప్రభుత్వ భూముల వ్యవహారాలపై సమగ్ర విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. నా మీద ఒక్క రూపాయి అవినీతిని ఆధారాలతో నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. కానీ మీ పదేళ్ల పాలనలో జరిగిన వందల అక్రమాలను ప్రజల ముందు పెట్టే ధైర్యం మాకు ఉందని స్పష్టం చేశారు.
అలీబాబా దొంగల ముఠాను మించిన దోపిడీలు చేసి ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకునేందుకు దుష్ప్రచారం చేస్తున్నారు. పదేళ్లలో వరంగల్‌కు ఏమి చేయని వారు, మూడు సంవత్సరాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అబద్ధాల ప్రచారానికి దిగుతున్నారు అని ఎమ్మెల్యే మండిపడ్డారు.
వరంగల్‌కు విమానాశ్రయం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, కోచ్ ఫ్యాక్టరీ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్టులు అమలు అవుతున్నాయని, ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారని తెలిపారు. అందుకే ప్రజల్లో ఆదరణ కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు ప్రతిరోజూ దుష్ప్రచారాలను ఆయుధంగా చేసుకుని రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలే తీర్పు చెబుతారు. మీ పదేళ్ల పాలనకు, మా మూడేళ్ల పాలనకు మధ్య తేడా ఏమిటో వరంగల్ ప్రజలకు స్పష్టంగా తెలుసు. అబద్ధాలతో కాదు… అభివృద్ధితోనే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటాం అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు స్పష్టం చేశారు.




