Hanamkonda: భూకబ్జాదారులపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్

Hanamkonda: హనుమకొండ కాంగ్రెస్ ఆఫీస్‌లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం.

AJAY, HANMAKONDA
Published on: 21 Jun 2026 3:43 PM IST
Hanamkonda
X

Hanamkonda: భూకబ్జాదారులపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్

హనుమకొండ: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పలు కీలక అంశాలపై స్పందించారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు పూర్తి వాస్తవాలు చెప్పకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన ఉద్యమకారులను మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, బీజేపీ నాయకులు విస్మరించారని ఆరోపించారు.

వరంగల్ నగరంలోని మాడ వీధుల అభివృద్ధికి రూ.11 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చించి రూ.19 కోట్ల నిధులు మంజూరు చేయించామని, వాటిని గత ప్రభుత్వ విజయాలుగా ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు.

వైఎస్ఆర్ నగర్ భూముల అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడిన ఆయన, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రతిపాదించారు.

నగరంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి, హైడ్రా తరహాలో తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి పార్టీ కార్యాలయాలు నిర్మించిన చరిత్ర బీఆర్ఎస్‌కే ఉందని ఆరోపించారు.

వరంగల్ నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రభుత్వ స్థలాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.

మామునూరు విమానాశ్రయ అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆరోపించిన ఆయన, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తగిన నిధులు కేటాయించడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె. జయశంకర్ సేవలను స్మరించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ మహనీయులను గౌరవిస్తోందన్నారు.

ప్రజలు అభివృద్ధి పనులను గమనిస్తున్నారని, పనిచేసే నాయకులను ఆదరిస్తారని పేర్కొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, తాను ఎల్లప్పుడూ ప్రజల అభ్యున్నతి, అభివృద్ధి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, పారదర్శక పాలన లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు.

AJAY, HANMAKONDA

AJAY, HANMAKONDA

Next Story