Warangal: వరంగల్ పెద్దమ్మగడ్డలో అర్బన్ హెల్త్ సెంటర్‌కు శంకుస్థాపన!

Warangal: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పెద్దమ్మగడ్డలో రూ.1.43 కోట్లతో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Sept 2026 12:03 PM IST
Warangal
X

Warangal: వరంగల్ పెద్దమ్మగడ్డలో అర్బన్ హెల్త్ సెంటర్‌కు శంకుస్థాపన!

Warangal: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పెద్దమ్మగడ్డ కాలనీకి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రూ.1.43 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దమ్మగడ్డ ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని వెనుకబడిన ప్రాంతంగా ఉందన్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారే తప్ప, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలనే ఆలోచనతో ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు.

ప్రజలకు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

సుమారు రూ.1.43 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉండేలా, శాశ్వతంగా వైద్య సేవలు అందేలా సంబంధిత అధికారులతో ఇప్పటికే మాట్లాడినట్లు వెల్లడించారు.

పెద్దమ్మగడ్డ అభివృద్ధికి హెల్త్ సెంటర్‌తో పాటు రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కూడా పరిశీలించి, అందుకు అవసరమైన నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పెద్దమ్మగడ్డ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్