Hanamkonda: మతసామరస్యం, విద్యాభివృద్ధికి ఆజాద్ సేవలు చిరస్మరణీయం!

Hanamkonda: హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పాల్గొని ఆజాద్‌కి నివాళులర్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Nov 2026 12:28 PM IST
Hanamkonda
X

Hanamkonda: మతసామరస్యం, విద్యాభివృద్ధికి ఆజాద్ సేవలు చిరస్మరణీయం!

Hanamkonda: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, గొప్ప విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు అన్నారు.

జాతీయ విద్యా దినోత్సవం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్ గారితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విశేష కృషి చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన అందించిన సేవలు, దేశ ఐక్యత కోసం చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా మతసామరస్యం, సమానత్వం, సోదరభావం వంటి విలువలను సమాజంలో బలోపేతం చేయడంలో ఆజాద్ ఆలోచనలు నేటికీ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని అన్నారు. ఆయన ఆశయాలను, దేశం కోసం చేసిన సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడంతో పాటు, ఆయన స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, మైనారిటీ సెల్ చైర్మన్ బాబాభాయ్, మైనారిటీ నాయకులు ఇస్మాయిల్, అజీజ్ ఉల్లా, అబూబకర్, మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్