Jangaon: వ్యవసాయం, విద్య, వైద్యానికి పెద్దపీట: ఎంపీ కడియం కావ్య

Jangaon: జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశా సమావేశంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభివృద్ధి పనులపై సమీక్షించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 15 Sept 2026 7:02 PM IST
Jangaon
X

Jangaon: వ్యవసాయం, విద్య, వైద్యానికి పెద్దపీట: ఎంపీ కడియం కావ్య

జనగామ జిల్లా: జిల్లా అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశా) కమిటీ ఛైర్పర్సన్ కడియం కావ్య అధికారులను అదేశించారు.

మంగళవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశా) కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశా) కమిటీ ఛైర్పర్సన్ కడియం కావ్య, ఘనపూర్ (స్టేషన్) ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, దిశా కమిటీ సభ్యురాలు కేసిరెడ్డి మాధవి, దిశా కమిటీ సభ్యులు బక్క శ్రీను, కొర్ర వెంకటేష్ నాయక్, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, ఘనపూర్ (స్టేషన్) మున్సిపల్ ఛైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ హాజరయ్యారు.

ముందుగా జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల పురోగతి నివేదికలను ఈ సమావేశంలో వివరించారు.

విద్యా శాఖకు సంబంధించి జిల్లాలో 15 పీఎం శ్రీ పాఠశాలలు, 5 మోడల్ పాఠశాలలు, ఒక సోషల్ వెల్ఫేర్ పాఠశాల, 5 జెడ్పీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి 84 పనులకు పరిపాలనా అనుమతులు లభించగా, 74 పనులు కొనసాగుతున్నాయని, 2026 పదో తరగతి ఫలితాల్లో జిల్లా 97.66 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సమావేశంలో వెల్లడించారు.

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును సమీక్షిస్తూ, జిల్లాలో 693 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని డీడబ్ల్యూఓ వివరించగా, సొంత భవనాలు లేని కేంద్రాలకు భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ సూచించారు.

గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఎల్‌ఎం ద్వారా సీసీ రోడ్లు, అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు చేపడుతున్నట్లు డీఆర్డీఓ తెలిపారు. జిల్లాకు మూడు అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరయ్యాయని, 12 మండల సమాఖ్యలకు 12 బస్సులు కేటాయించినట్లు వెల్లడించారు. డీడీయూ-జీకేవై, ఎన్‌ఎస్‌ఏపీ, ఆర్‌సెటీ, తదితర పథకాల అమలుపై కూడా వివరించారు.

పీఎంకేఎస్‌వై–2.0 కింద వాటర్‌ షెడ్ అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రంలో జిల్లా 15వ స్థానంలో ఉందని, 52 ఫామ్ పాండ్స్ నిర్మించినట్లు అధికారులు తెలిపారు. హెచ్‌హెచ్‌టీఎల్, కమ్యూనిటీ సోక్‌ పిట్ల నిర్మాణంలో కూడా జిల్లా రాష్ట్రంలో ఉన్నత స్థానం సాధించినట్లు వివరించారు.

పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో స్వామిత్వ పథకం, జల్ జీవన్ మిషన్ కింద ప్రతిపాదనలను పంపాలని ఎంపీ అధికారులకు సూచించారు. కాలువల మరమ్మతులు, పునరుద్ధరణ, చెరువుల పూడికతీత పనులకు 1.90 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లాలో 68 చెరువులు నింపినట్లు నీటి పారుదల శాఖ అధికారి వివరించారు.

వ్యవసాయ శాఖకు సంబంధించి పీఎం కిసాన్, రైతు భరోసా కింద 184438 మంది రైతుల ఖాతాల్లోకి 23337.73 లక్షలను జమ చేసినట్లు డీఏఓ వివరించారు. రైతు బీమా, జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్), ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎం, ఎన్‌ఎంఈఓ, తదితర పథకాల అమలుపై వివరించారు. జిల్లాలో భూసార పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నారో? భూసారాన్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను తెలియజేయాలని సూచించగా, మట్టి ఆరోగ్య నమూనాల సేకరణ, రసాయనాల వినియోగ నియంత్రణ గురించి వివరణ ఇవ్వగా, పారా క్వాట్ వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఎంపీ సూచించారు.

పశుసంవర్థక శాఖకు సంబంధించి ఎన్‌ఏడీసీపీ, ఎన్‌ఎల్‌ఎం పథకాల కింద 10 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాల పంపిణీ, 1,500 పాలిచ్చే పశువుల లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు డీవీహెచ్ఓ తెలిపారు. కృత్రిమ గర్భధారణ, గోపాల మిత్ర, పశు మిత్ర సేవలు, పాల ఉత్పత్తి, పాల సేకరణ పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు.

మత్స్య శాఖకు సంబంధించి పీఎంఎంఎస్‌వై కింద చేపల రిటైల్ అవుట్‌ లెట్లు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల పంపిణీ, తదితర అంశాలపై మత్స్య శాఖ అధికారి వివరించారు.

వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి టీబీ రోగులకు పోషకాహార కిట్ల పంపిణీ, హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాల అమలు, ఇతర ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని డీఎంహెచ్ఓ వివరించారు.

ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. జిల్లాలో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య అందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీసుకుంటున్న ప్రత్యేక చొరవ అభినందనీయమని వరంగల్ పార్లమెంట్ సభ్యులు, దిశా కమిటీ ఛైర్పర్సన్ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి, అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద మంజూరు చేసిన మూడు నెలల్లో పనులు ప్రారంభం కాకపోతే వెంటనే వాటిని రద్దు చేయాలని, వినియోగించిన నిధులను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నవీకరించాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన పారక్వాట్ గడ్డి మందు వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని, పారక్వాట్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

విద్య, వైద్య రంగాలపై సూచనలు

పిల్లల్లో మానసిక వైకల్యాన్ని పాఠశాల స్థాయిలోనే గుర్తించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మానసిక సమస్యలను తగ్గించేందుకు సరైన శిక్షణ, మార్గదర్శకత్వం అందించాలని చెప్పారు.

విద్యార్థుల్లో రక్తహీనతను అంగన్‌వాడీ, ప్రీ-ప్రైమరీ దశ నుంచే గుర్తించాలని, పోషకాహారం, అవసరమైన మందులు అందించడంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు.

జాతీయ రహదారి–163లో మిస్సింగ్ సర్వీస్ రోడ్ల నిర్మాణ పురోగతిపై నేషనల్ హైవేస్ అధికారుల ద్వారా వివరణ అడిగి తెలుసుకున్నారు. రాఘవాపురం వద్ద వర్షపు నీరు జాతీయ రహదారిపై నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చాగల్, ఘనపూర్, పెద్దపెండ్యాల ప్రాంతాల్లో నిర్మించిన సైడ్ డివైడర్లు ఉపయోగకరంగా లేవని పేర్కొని, వాటిని సరిచేయాలని ఆదేశించారు.

మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు

జిల్లాలో మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.

జిల్లాలో ఇప్పటికే అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు మరిన్ని వినూత్న ఆలోచనలను ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. కొత్త కార్యక్రమాలను కేవలం ప్రారంభించడమే కాకుండా, వాటి ప్రయోజనాలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా సమర్థవంతమైన అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమవుతాయని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజల సంక్షేమం, విద్యార్థుల అభివృద్ధి, విద్యా రంగ బలోపేతం కోసం జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న ప్రత్యేక చొరవను అభినందించారు.

గతంలో జనగామ జిల్లా పాల ఉత్పత్తి, పాల సేకరణలో ముందుండేదని, ప్రస్తుతం పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. జిల్లాలో చేపల పెంపకానికి అనువైన జలాశయాలు ఉన్నందున ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పాల ఉత్పత్తి పెంపు, చేపల పెంపకం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలని అధికారులను ఆదేశించారు.

నెల్లుట్ల చెరువు సమస్యకు పరిష్కారం చూపాలి

జనగామ పట్టణ మురుగునీరు నెల్లుట్ల చెరువులోకి చేరకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు దుర్గంధంతో నిండిపోవడంతో గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఎస్టీపీ నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు.

ప్రజలకు పథకాల ఫలాలు పారదర్శకంగా, వేగంగా అందేలా శాఖల మధ్య సమన్వయంతో మరింత సమర్థవంతంగా పని చేయాలని అధికారులకు సూచించారు.

అంతకుముందు ఈ దిశా సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, దిశా కమిటీ ఛైర్పర్సన్ కు వివరించారు.

జిల్లాలో 173 అంగన్‌వాడీ కేంద్రాలు ఇతర భవనాల్లో నిర్వహిస్తున్నాయని, ఆయా కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అదే విధంగా జిల్లాలోని 280 గ్రామ పంచాయతీలకు గాను 208 గ్రామ పంచాయతీలకు వీఓ భవనాల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని వివరించారు. RSETI భవన నిర్మాణానికి మంజూరు లభించినట్లు తెలిపారు.

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, హెల్త్ కార్డుల ద్వారా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని కలెక్టర్, ఎంపీకి వివరించారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెల్లుట్ల చెరువులోకి మురుగునీరు చేరకుండా ఎస్‌టీపీ (STP) నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. దీంతో చెరువు నీటి నాణ్యతను పరిరక్షించడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా NDPS Act కింద గత ఆరు సంవత్సరాల కాలంలో ఎక్సైజ్ శాఖ రెండు కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే COTPA Act అమలుపై జిల్లాలో నిరంతర పర్యవేక్షణ చేపడుతూ, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఎంపీకి వివరించారు.

అలాగే డీసీపీ వివరిస్తూ.. మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎంపీకి వివరించారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

అలాగే జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, వీటి ద్వారా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, డార్క్ స్పాట్లను గుర్తించి, భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు నేరాల నియంత్రణ, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెంచేందుకు వీలవుతుందని వివరించారు.

ప్రత్యేకంగా పిల్లలు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళలు, బాలికలకు రక్షణ కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. మహిళలు, పిల్లలకు అవసరమైన సమయంలో తక్షణ సహాయం, రక్షణ అందించేలా భరోసా కేంద్రాల సేవలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తున్నామని డీసీపీ, ఎంపీకి వివరించారు.

అనంతరం దిశా కమిటీ సభ్యురాలు మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణను మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. చిన్న, సన్నకారు రైతులకు యంత్ర పరికరాలు అందుబాటులోకి తీసుకురావడంతో సాగు ఖర్చులు తగ్గి, రైతుల ఉత్పాదకత పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.

అలాగే ఆయిల్‌ పామ్ సాగుపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఆయిల్‌ పామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, సాగు విధానం, మార్కెటింగ్ అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, తదితర అంశాలను రైతులకు స్పష్టంగా వివరించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి, ఆయిల్‌ పామ్ సాగు విస్తరణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ దిశా సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాష్, మునిసిపల్ కమిషనర్లు రాజశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON