Mahabubabad: మహబూబాబాద్‌లో దిశా కమిటీ సమావేశం.. కలెక్టర్, ఎస్పీ హాజరు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఎంపీ, దిశా కమిటీ చైర్మన్ పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన సమీక్షా సమావేశం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 19 Jun 2026 7:49 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో దిశా కమిటీ సమావేశం.. కలెక్టర్, ఎస్పీ హాజరు!

Mahabubabad: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణతో పనిచేయాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు, దిశా కమిటీ చైర్మన్ పోరిక బలరాం నాయక్ అన్నారు.

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాధాబాయి, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా పోలీసు అధికారి సుధీర్ రామ్నాద్ కేకన్, అటవీ శాఖ జిల్లా అధికారి వికాస్ మీనా, దిశా కమిటీ సభ్యులు పూర్ణచందర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ పోరిక బలరాం నాయక్ జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని శాఖల వారీగా సమగ్రంగా సమీక్షించి, పనుల అమలులో ఎటువంటి జాప్యం లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.

జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కాన్ ఏర్పాటు కోసం తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాల విద్యార్థులతో గిరిజన ప్రాంతాలలో వైద్య శిక్షణ శిబిరాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

సమగ్ర శిక్ష కార్యక్రమం, మధ్యాహ్న భోజన పథకం అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

వ్యవసాయ రంగంపై మాట్లాడుతూ యూరియా వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, ఆన్లైన్ విధానం ద్వారానే ఎరువుల కొనుగోలు, అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గుచూపేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

ములుగు, ఏటూరునాగారం ప్రాంతాలలో రింగ్ రోడ్ ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన పనుల జాబితాను రూపొందించి ప్రాధాన్యత క్రమంలో అమలు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల పనితీరుపై దిశా సమావేశంలో సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ఆరోగ్య శాఖలో ఓపీ సేవలు, మందుల లభ్యత, వైద్య పరికరాల అందుబాటు, పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో విద్యాశాఖ చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

సమావేశానికి హాజరైన మహిళా కమిషన్ సభ్యులు, దిశా కమిటీ సభ్యులు, అధికారులు, సమన్వయంతో సహకరించారని, జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే దిశగా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి దిశా సమావేశం నిర్వహిస్తూ అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా సమీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రవికుమార్, ములుగు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story