Mahabubabad: రూ. 550 కోట్లతో గ్రామీణ రోడ్ల అభివృద్ధి!

Mahabubabad: రూ. 550 కోట్ల రహదారుల ఆధునికీకరణతో పాటు విద్యా, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేస్తామని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి స్పష్టీకరణ.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 14 July 2026 8:07 AM IST
Mahabubabad
X

Mahabubabad: రూ. 550 కోట్లతో గ్రామీణ రోడ్ల అభివృద్ధి!

Mahabubabad: జిల్లా అభివృద్ధే లక్ష్యంగా విద్య, మౌలిక వసతులు, సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి కి నిరంతరం పనిచేస్తానని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

మహబూబాబాద్ జిల్లాకేసముద్రం మండల కేంద్రంలో నూతన అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించి ... 2 కోట్ల రూపాయల తో చేపట్టే అగ్నిమాపక భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, జిల్లా సహకార కేంద్ర బ్యాoకు ప్రాంగణాన్ని వేం నరేందర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామీణ ప్రాంత రహదారులను 550 కోట్ల రూపాయలతో ఆధునికరిస్తానన్నారు.కేసముద్రం మున్సిపాలిటీ రహదారుల విస్తరణలో జీవనాధారమైన దుకాణాలు కోల్పోయిన బాధిత వ్యాపారులకు వాణిజ్య సముదాయాలు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

గూడూరులో రూ.200 కోట్లతో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయని, ఇనుగుర్తిలో అడ్వాన్స్ టెక్నాలజీ విద్యా సంస్థలను తీసుకురావడంతో పాటు, నెల్లికుదురులో టీజీ పబ్లిక్ స్కూల్‌కు రూ.15 కోట్ల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. గూడూరు–ఉప్పరపల్లి మధ్య హై లెవల్ వంతెనల నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. కేసముద్రం మున్సిపాలిటీలో ఏడు సంవత్సరాలపాటు విద్యుత్ వీధి దీపాల పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు చెప్పారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.70 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు.

జిల్లాలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని, పాఠశాలలు, కళాశాలల భవనాలను ఆధునీకరిస్తామని తెలిపారు. జూనియర్ కళాశాలకు రూ.10.60 కోట్లతో నూతన భవనం నిర్మించనున్నట్లు చెప్పారు. యూకేజీ నుంచి ఇంటర్ వరకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలను కొనసాగిస్తామని, బాలికల కళాశాల భవనాల నిర్మాణానికి రూ.20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మహబూబాబాద్‌లో ఇంజినీరింగ్ కళాశాల భవన నిర్మాణానికి కృషి చేస్తున్నామని, రెండో విడతలో నియోజకవర్గానికి 10 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడమే లక్ష్యమని చెప్పారు.

అర్హులందరికీ రేషన్ కార్డులు అందించడంతో పాటు, 3.5 లక్షల మంది లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చీరల పంపిణీ వంటి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని,రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేశామన్నారు. పార్టీలో పదవులు రాని కాంగ్రెస్ నాయకులను కూడా సముచితంగా గౌరవించాలని పిలుపునిచ్చారు.పార్టీ కోసం పనిచేసి నష్టపోయిన కార్యకర్తలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో అగ్నిమాపాక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాను, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎంపీ పోరిక బాలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ సునీత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఘంట సంజీవ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ లు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD

Next Story