Mulugu: ములుగు జిల్లాలో పర్యటించనున్న కేంద్ర బృందం

Mulugu: ములుగు జిల్లా చల్వాయి, మేడారం గ్రామాల్లో గ్రామీణ పారిశుద్ధ్య సేవలపై రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్న కేంద్ర బృందం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 5 Aug 2026 6:35 PM IST
Mulugu
X

Mulugu: ములుగు జిల్లాలో పర్యటించనున్న కేంద్ర బృందం

ములుగు: గ్రామీణ పారిశుద్ధ్య సేవల బలోపేతానికి కేంద్ర బృందం ములుగు జిల్లా లోని చల్వాయి, మేడారం గ్రామాలలో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుందని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు.

బుధవారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తన ఛాంబర్ లో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కింద గ్రామీణ పారిశుద్ధ్య ఆస్తులు, సేవల నిర్వహణకు భవిష్యత్తులో అవసరమయ్యే నిధుల అంచనపై అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ బృందం, యూనిసెఫ్ ప్రతినిధులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సేవలను మరింత బలోపేతం చేయడానికి ఇటువంటి అధ్యయనాలు దోహదపడతాయని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అధ్యయన నివేదికను సమర్పించాలని బృందాన్ని కోరారు. సంబంధిత శాఖల సమన్వయంతో అధ్యయన బృందానికి అవసరమైన సహకారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యూనిసెఫ్ సహకారంతో ఈ అధ్యయనం నిర్వహించబడుతోంది. గ్రామీణ పారిశుద్ధ్య మౌలిక సదుపాయాల నిర్వహణ, నిర్వహణ వ్యయాలు, భవిష్యత్ నిధుల అవసరాలను అంచనా వేయడం ఈ అధ్యయనం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా తెలంగాణ, అసోం, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ అధ్యయనం చేపట్టనుండగా, తెలంగాణలో ములుగు, నారాయణపేట జిల్లాలను ఎంపిక చేశారు. ములుగు జిల్లాలో చల్వాయి, మేడారం గ్రామ పంచాయతీలను అధ్యయనం కోసం గుర్తించినట్లు తెలిపారు.

ఆగస్టు 5, 6 తేదీల్లో రెండు రోజుల పాటు కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి గ్రామీణ పారిశుద్ధ్య సేవలు, మౌలిక సదుపాయాల నిర్వహణపై క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహించనుంది.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎం. సంపత్‌రావు, కేంద్ర ఐఈజీ బృంద సభ్యులు డాక్టర్ నితీష్ ఖన్నా, అనుకేత్, యూనిసెఫ్ రాష్ట్ర సమన్వయకర్త శ్రీహరి నక్క, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జి. రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి కె. వెంకయ్య, ఏడీపీ ఎం. వెంకటనారాయణ, స్వచ్ఛ భారత్ మిషన్ కన్సల్టెంట్లు మైమున్నిస్సా, షర్పున్నిస్సా తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story