Mulugu: రేషన్ కార్డు ఉన్న ప్రతి అర్హత కుటుంబానికి 2 రోజుల్లోనే జాబ్ కార్డు

Mulugu: ములుగు జిల్లాలో రేషన్ కార్డు ఉండి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 2 రోజుల్లో నూతన జాబ్ కార్డు మంజూరు చేస్తామని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ తెలిపారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 13 Nov 2026 11:10 PM IST
Mulugu
X

Mulugu: రేషన్ కార్డు ఉన్న ప్రతి అర్హత కుటుంబానికి 2 రోజుల్లోనే జాబ్ కార్డు

ములుగు జిల్లా: ములుగు జిల్లాలోని అన్ని మండలాల్లో రేషన్ కార్డు ఉండి, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు.

శుక్రవారం ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎం. సంపత్ రావుతో కలిసి నూతన జాబ్ కార్డుల మంజూరు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పేద కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వీబీ-గ్రామ్ జీ పథకం ద్వారా 19 లక్షల పనిదినాలను కల్పించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు.

జిల్లాలోని ఏ గ్రామంలోనైనా రేషన్ కార్డు ఉండి, జాబ్ కార్డు లేని అర్హ కుటుంబాలు గ్రామ పంచాయతీ కార్యదర్శిని లేదా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా 5 ఎకరాలలోపు భూమి ఉన్న అర్హత కలిగిన కుటుంబాలన్నీ జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు సమర్పించిన రెండు రోజుల్లో నూతన జాబ్ కార్డు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

అదేవిధంగా పెద్ద కుటుంబాల్లో ఒకే జాబ్ కార్డు కలిగి ఉన్నవారు, 18 సంవత్సరాలు నిండిన వారు, వివాహమైన వారు అర్హత మేరకు జాబ్ కార్డు విభజన ద్వారా వేర్వేరు జాబ్ కార్డులు పొందవచ్చని తెలిపారు.

గ్రామాల్లో ప్రస్తుతం వినియోగంలో లేని జాబ్ కార్డులను తిరిగి క్రియాశీలం చేసి, ఆయా కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ సత్వరమే నూతన జాబ్ కార్డులు అందజేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ రవీందర్, ఏపీడీ శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.