Mulugu: పట్టభద్రుల ఓటరు జాబితాను పకడ్బందీగా పూర్తి చేయాలి: ఈసీ!

Mulugu: పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు జాబితా నూతన రూపకల్పన పురోగతిపై భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సుమన్ కుమార్ దాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

I NARESH, ETURUNAGARAM
Published on: 18 Nov 2026 2:54 PM IST
Mulugu
X

Mulugu: పట్టభద్రుల ఓటరు జాబితాను పకడ్బందీగా పూర్తి చేయాలి: ఈసీ!

ములుగు: పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఓటరు జాబితాల నూతన రూపకల్పన ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సుమన్ కుమార్ దాస్ సంబంధిత అధికారులకు సూచించారు.

బుధవారం న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సుమన్ కుమార్ దాస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు జాబితాల నూతన రూపకల్పన (డి-నోవో) ప్రక్రియ పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బోర్ఖడే హేమంత్ సహదేవరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు జాబితాల నూతన తయారీ ప్రక్రియలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని సమీక్షించారు. ఓటరు నమోదు, దరఖాస్తుల పరిశీలన, అర్హులైన పట్టభద్రులను ఓటరు జాబితాలో చేర్చడం తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ముఖ్యంగా పట్టభద్రుల ఓటరు నమోదుకు సంబంధించిన ఫారం-18 దరఖాస్తులను బల్క్‌గా స్వీకరించరాదని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలని, దరఖాస్తుదారుల అర్హతలు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. అర్హులైన పట్టభద్రుల పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడడంతో పాటు అనర్హుల పేర్లు జాబితాలో చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు జాబితా నూతన రూపకల్పన ప్రక్రియను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఓటరు నమోదు దరఖాస్తుల పరిశీలనను నిబంధనల ప్రకారం చేపట్టి, నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో కె. కృష్ణవేణి, డిప్యూటీ తహసీల్దార్ నితీష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

I NARESH, ETURUNAGARAM

I NARESH, ETURUNAGARAM