Mangapet: రోడ్డుపై వరి నాట్లు వేసి కొత్తమల్లూరు గ్రామస్థుల నిరసన
Mangapet: ములుగు జిల్లా కొత్తమల్లూరులో బురదమయంగా మారిన రోడ్లపై వరి నాట్లు వేసి వినూత్న నిరసన తెలిపిన గ్రామస్థులు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం.
Mangapet: రోడ్డుపై వరి నాట్లు వేసి కొత్తమల్లూరు గ్రామస్థుల నిరసన
మంగపేట: ములుగు జిల్లాలోని మంగపేట మండలం కొత్త మల్లూరు గ్రామంలో రహదారుల దుస్థితిపై గ్రామస్థులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నడవడానికి కూడా వీలు లేకుండా బురదమయంగా మారిన రోడ్డుపై వరి నాట్లు వేసి అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. తమ గ్రామ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను వేడుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మంగపేట మండలం కొత్త మల్లూరు గ్రామంలో రహదారుల పరిస్థితి దారుణంగా మారింది. చిన్న వర్షానికే రోడ్లు పూర్తిగా బురదమయంగా మారడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నడవడానికి కూడా అవకాశం లేకపోవడంతో విద్యార్థులు, వృద్ధులు, అత్యవసర సేవలు పొందాల్సిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు.
పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, రోడ్డుపైనే వరి నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత రహదారి నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించి గ్రామ ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.




