Hanamkonda: జూలై 13న నులి పురుగుల నిర్మూలన దినోత్సవం!
Hanamkonda: జూలై 13న జిల్లావ్యాప్తంగా 2,08,441 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ విజ్ఞప్తి.
Hanamkonda: జూలై 13న నులి పురుగుల నిర్మూలన దినోత్సవం!
Hanamkonda: జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జూలై 13 (సోమవారం) జిల్లావ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి వైద్య, విద్య, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి అవసరమైన సూచనలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మొత్తం 2,08,441 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 1–2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అర మాత్ర, 2 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల వారికి ఒక పూర్తి మాత్ర అందజేయనున్నట్లు తెలిపారు. ఆల్బెండజోల్ మాత్రలు పూర్తిగా సురక్షితమైనవని, వాటివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని స్పష్టం చేశారు. పిల్లలను నులి పురుగుల బారిన పడకుండా కాపాడేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.
నులి పురుగుల సంక్రమణ వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, మలబద్ధకం, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా చదువుపై ఏకాగ్రత తగ్గడం, తరచూ అనారోగ్యానికి గురికావడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయని పేర్కొన్నారు.
నులి పురుగుల సంక్రమణను నివారించేందుకు భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, ఎల్లప్పుడూ చెప్పులు ధరించడం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను శుభ్రంగా కడిగి వినియోగించడం, వేడి వేడి మరియు పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, సురక్షితమైన తాగునీటిని వినియోగించడం, బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండడం వంటి పరిశుభ్రత అలవాట్లను ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
జిల్లాలోని 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారి ఆల్బెండజోల్ మాత్రను తప్పనిసరిగా తీసుకునేలా తల్లిదండ్రులు సహకరించి, జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ విజ్ఞప్తి చేశారు.




