Bhupalpally: భూపాలపల్లిలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!
Bhupalpally: భూపాలపల్లిలో ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అమరులకు నివాళులు, రక్తదాన శిబిరం, అవగాహన ర్యాలీ.. వన్యప్రాణులను వేటాడొద్దని అటవీ శాఖ పిలుపు.
Bhupalpally: భూపాలపల్లిలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!
భూపాలపల్లి: అడవులను, వన్యప్రాణులను, సహజ వనరులను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారులు, సిబ్బందిని స్మరించుకుంటూ జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 11న భూపాలపల్లి అటవీ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడంతో పాటు అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టారు.
దేశంలోని అడవులు, సహజ వనరులను కాపాడే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరవీరులకు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. రిజర్వ్ అడవుల్లో వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలు లేదా కరెంట్ ఉచ్చులు ఏర్పాటు చేయవద్దని కోరారు. వన్యప్రాణులను పట్టుకునేందుకు ఉచ్చులు, బోనులు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు.
విధి నిర్వహణలో ఉన్న అటవీ సిబ్బందిపై దాడులకు పాల్పడవద్దని, అటవీ భూములను ఆక్రమించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అడవులు దేశానికి అమూల్యమైన జాతీయ సంపద అని, వాటిని మరియు వన్యప్రాణులను సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. అటవీ సంరక్షణలో అటవీ శాఖకు ప్రజలందరూ సహకరించాలని జిల్లా అటవీ అధికారి కోరారు.




