Guduru: గూడూరు మండలంలో విద్యాబోధన దారితప్పింది!
Guduru: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై విమర్శలు. విధులను గాలికి వదిలి రాజకీయాలు, ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహిస్తున్నట్లు స్థానికుల ఆరోపణలు.
Guduru: గూడూరు మండలంలో విద్యాబోధన దారితప్పింది!
Guduru: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గిరిజన ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన దారితప్పుతోంది. గిరిజన తండాలు, గూడాలలోని నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు.
ఉదయం 'హాజరు'.. ఆ వెంటనే నూటికి నూరు శాతం 'గైర్హాజరు'!
ప్రభుత్వం ఉపాధ్యాయుల హాజరు కోసం ప్రవేశపెట్టిన 'ఎఫ్.ఆర్.ఎస్' యాప్‌ను కొందరు ఉపాధ్యాయులు కేవలం నిబంధన పూర్తి చేయడానికే ఉపయోగిస్తున్నారు. ఉదయం పాఠశాలకు రావడం, సెల్ ఫోన్‌లో ఫోటో అప్‌లోడ్ చేసి హాజరు నమోదు చేయడం.. ఆ వెంటనే అక్కడ నుంచి ఉడాయించడం నిత్యకృత్యంగా మారిందని తండావాసులు మండిపడుతున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పాలనే ధ్యాస లేకుండా, కేవలం నెలనెలా జీతాలు తీసుకోవడానికే పరిమితమవుతున్నారని వాపోతున్నారు.
ప్రైవేటు బాట పట్టాలంటూ ఉపాధ్యాయుడి ‘హితవు’!
ఈ నిర్లక్ష్యం అంతటితో ఆగలేదు. తండాలో ప్రభుత్వ పాఠశాల భవనం, ఇతర సదుపాయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ.. విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ బడికి పంపొద్దంటూ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడే స్వయంగా ప్రోత్సహించడం గమనార్హం. "మీ పిల్లలను ప్రభుత్వ బడిలో ఉంచడం కంటే ప్రైవేట్ పాఠశాలలకు పంపడమే మంచిది" అని ఆ ఉపాధ్యాయుడు తల్లిదండ్రులకు ఉచిత సలహాలు ఇచ్చాడు. బాధ్యతాయుతమైన హోదాలో ఉండి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి, ప్రైవేటు వైపు ప్రోత్సహించడంతో తండాలోని పిల్లలందరూ ప్రైవేట్ పాఠశాలల బాట పట్టారు.
సంఘం నాయకత్వం పేరిట రాజకీయాలు
మండలంలోని లైన్ తండ గ్రామపంచాయతీ శివారు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు. ప్రభుత్వ బడిని, విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసి సంఘం నాయకుడిని అని, రాజకీయం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. పొనుగోడు గ్రామపంచాయతీ శివారు చిర్రకుంట కోయగూడెం పాఠశాలలో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయుడు హిందూ ఉత్సవ సమితి అంటూ, పాఠశాలను గాలికి వదిలేసి కాలయాపన చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా బొద్దుగుండ గ్రామపంచాయతీ శివారులో ఉన్న తండా పాఠశాలలో పనిచేసే ఒక ప్రముఖ ఉపాధ్యాయుడు వివిధ సంఘం నాయకులు అంటూ రాజకీయ నాయకులమంటూ చలామణి అవుతూ ఆ పాఠశాలను గాలికి వదిలేశారు. అయోధ్య పురం గ్రామపంచాయతీ శివాలు రాంపురం గూడెంకు చెందిన పాఠశాల ఉపాధ్యాయుడు కూడా ఇదే తంతుగా మారడంతో స్థానికులు వీరిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరిస్తూ, రాజకీయాల పేరిట కాలక్షేపం చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి!
గిరిజన ప్రాంత పిల్లలకు ఉచిత, నాణ్యమైన విద్య దక్కకుండా చేస్తున్న ఇలాంటి ఉపాధ్యాయులపై సమగ్ర విచారణ జరిపించాలని గిరిజన తండాల ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విధులకు ముఖం చాటేస్తూ, ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తున్న సదరు ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ అధికారులు,గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




