Gudur: గూడూరులో గిరిజన పాఠశాలల పర్యవేక్షణ లోపం

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో అధికారుల పర్యవేక్షణ లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

B NARASIMHA, GUDUR
Published on: 20 July 2026 9:27 AM IST
Gudur
X

Gudur: గూడూరులో గిరిజన పాఠశాలల పర్యవేక్షణ లోపం

గూడూరు: ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపంతో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గిరిజన ప్రాథమిక పాఠశాల పరిస్థితి అథోగతి పాలైంది. భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన పాఠశాల, నేడు బాధ్యతారహిత్యానికి నిలయంగా మారింది.

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలను పూర్తిగా గాలికి వదిలేశారని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమయపాలన లేదు.. బాధ్యతా లేదు

ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కనీస సమయపాలన కరువైందని ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాల సమయానికి రాకపోవడం, విధులకు సరిగ్గా హాజరుకాకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన జిల్లా అధికారులు సైతం ఉపాధ్యాయుల కనుసన్నల్లోనే నడుస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా అధికారులను తమ చేతుల్లో పెట్టుకుని, కొందరు ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

గిరిజన ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ప్రభుత్వ ఆశయానికి ఇక్కడి ఉపాధ్యాయుల తీరు గొడ్డలిపెట్టుగా మారింది. పాఠశాల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో, విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఘోరంగా పడిపోతున్నాయి.

స్థానికుల డిమాండ్

"ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి, గూడూరు మండల గిరిజన ప్రాథమిక పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. విధులను నిర్లక్ష్యం చేస్తున్న ఉపాధ్యాయులపై, వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పాఠశాలకు పూర్వ వైభవం తీసుకువచ్చి, గిరిజన విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి."

విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు -డిడి దేశిరాం నాయక్

గిరిజన బిడ్డలకు విలువైన విద్యా ను అందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయాత్నాలు చేస్తుంది అని గిరిజన ప్రాథమిక పాఠశాల పట్ల ఉపాధ్యాయులు కావచ్చు పర్యవేక్షణ అధికారులు కావచ్చు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని డిప్యూటీ డైరెక్టర్ (డిడి) దేశిరామ్ నాయక్ అన్నారు. గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఏమన్నా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం అని డిడి తెలిపారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story