Gudur: అటకెక్కిన మెనూ.. గూడూరు ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల అవస్థలు!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు నరకం చూస్తున్నారు.

B NARASIMHA, GUDUR
Published on: 20 Jun 2026 3:56 PM IST
Gudur
X

Gudur: అటకెక్కిన మెనూ.. గూడూరు ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల అవస్థలు!

గూడూరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటిమూటలుగానే మిగులుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాల ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పాఠశాలలో కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

వంటగది లేదు.. పక్క ఇళ్లే దిక్కు!

ఈ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండటానికి కనీసం ఒక వంటగది (కిచెన్ షెడ్) కూడా లేకపోవడం గమనార్హం. దీంతో వంట మనుషులు పాఠశాల చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కొంత అన్నం, కూరలు వండి, వాటిని పాఠశాలకు మోసుకొచ్చి పిల్లలకు వడ్డించాల్సిన దుస్థితి నెలకొంది. సరైన వసతులు లేకపోవడంతో సకాలంలో వంట పూర్తికాక, విద్యార్థులు ఆకలితో అలమటించాల్సి వస్తోంది.

అటకెక్కిన మెనూ.. పౌష్టికాహారం శూన్యం

ప్రభుత్వం నిర్దేశించిన మధ్యాహ్న భోజన మెనూ ఇక్కడ ఎక్కడా అమలు కావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం అందడం లేదని, నాణ్యత లేని భోజనంతో విద్యార్థుల ఆరోగ్యం పాడవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్డు, పప్పు వంటి పోషకాలు ఉన్న ఆహారం సరిగ్గా అందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు స్పందించాలి:

"పక్క ఇళ్లలో వండి తీసుకురావడం వల్ల భోజనం చల్లారిపోవడమే కాకుండా, పరిశుభ్రత లోపిస్తోంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గుండెంగ పాఠశాలలో వంటగది నిర్మించాలని, మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని" గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story