Palakurthi: బహిరంగ చర్చకు సవాల్ విసిరితే అరెస్టులా?: బీజేపీ ఆగ్రహం!
Palakurthi: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో డబుల్ బెడ్రూం ఇళ్ల స్థలాలపై బహిరంగ చర్చకు సిద్ధమైన బీజేపీ నాయకులను పాలకుర్తి పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
Palakurthi: బహిరంగ చర్చకు సవాల్ విసిరితే అరెస్టులా?: బీజేపీ ఆగ్రహం!
పాలకుర్తి: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర నాయకుడు పాకనాటి దామోదర్‌రెడ్డి, చర్చ జరగకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చి బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయించారని ఆరోపించారు. బహిరంగ చర్చ జరిగితే డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన స్థలాల వ్యవహారంలో వాస్తవాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు.
ఈ వ్యవహారానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ప్రత్యక్ష చర్చకు అవకాశం కల్పించకపోయినా త్వరలోనే పత్రికాముఖంగా అన్ని వివరాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ నిధులు, స్థలాల కేటాయింపుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే అంశాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, “బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయకుండా మమ్మల్నే ఎందుకు అరెస్టు చేస్తున్నారు? దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే, ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్య సంబంధాలపై ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి” అని ప్రశ్నించారు. తమపై కేసులు నమోదు చేయాలని పోలీసులపై ఒత్తిడి తెస్తున్నది ఆ ఇద్దరు నాయకులేనని వారు ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులతో గొంతు నొక్కాలని చూడటం సరికాదని పేర్కొన్నారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని, ఆధారాలతో సహా ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడిస్తామని హెచ్చరించారు.
అరెస్టయిన వారిలో బీజేపీ పాలకుర్తి మండల అధ్యక్షుడు మారం రవికుమార్, జిల్లా నాయకుడు దొంగరి మహేందర్, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల దేవరాజు, మండల ఉపాధ్యక్షుడు పబ్బ సంతోష్ తదితరులు ఉన్నారు.




