Palakurthi: పాలకుర్తి పీఎం శ్రీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Palakurthi: పాలకుర్తి మండలంలోని పీఎం శ్రీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పరిశీలించారు.
Palakurthi: పాలకుర్తి పీఎం శ్రీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
పాలకుర్తి: గురువారం, జిల్లాలోని పాలకుర్తి మండలంలోని పీఎం శ్రీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించి, పాఠశాలలోని తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, వంటశాల, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అలాగే విద్యార్థులతో నేరుగా మాట్లాడి హిందీ, ఇంగ్లీష్, గణిత శాస్త్రం, సాంఘిక శాస్త్రం వంటి సబ్జెక్టుల్లో వారి అభ్యాస సామర్థ్యాన్ని పరీక్షించారు. బ్లాక్‌బోర్డుపై గణిత శాస్త్రం, సాంఘిక శాస్త్రానికి సంబంధించిన అంశాలను స్వయంగా బోధిస్తూ విద్యార్థులకు వివరించారు.
విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ అందాయా? పాఠ్యాంశాలు ఎంతవరకు పూర్తయ్యాయి? పాఠశాలలో అవసరమైన వసతులు ఉన్నాయా? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చదవడం, రాయడంతో పాటు ప్రతి సబ్జెక్టును సులభంగా అర్థం చేసుకునే విధంగా బోధన సాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు చెస్, వాలీబాల్, ఖోఖో, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడల్లో శిక్షణ అందించాలని పీఈటీని ఆదేశించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాఠశాలలో ఉన్న పాత బెంచీలను మరమ్మతులు చేసి అవసరమున్న ఇతర పాఠశాలలకు తరలించాలని, ఒక ప్రత్యేక గదిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రధానోపాధ్యాయురాలికి సూచించారు.
పాఠశాల భవనాలను పరిశీలించిన కలెక్టర్ తరగతి గదులకు సున్నం వేయించడం, దెబ్బతిన్న కిటికీల మరమ్మతులు, ఫ్యాన్లు లేని గదుల్లో కొత్త ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వంటశాల పాతదిగా ఉండడంతో సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించి, వెంటనే ప్రతిపాదనలు సమర్పిస్తే నిధుల మంజూరును పరిశీలిస్తామని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, విలువలు, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి పెంపొందించే దిశగా పని చేయాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, కష్టంగా అనిపించే సబ్జెక్టులపై అదనపు బోధన అందించాలని తెలిపారు.
సాంఘిక శాస్త్ర బోధనకు అవసరమైన మ్యాపులను ప్రతి తరగతి గదిలో ఏర్పాటు చేయాలని, కంప్యూటర్ల వినియోగంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచి కోడింగ్ వంటి నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోర్డులు వంటి ఆధునిక సాంకేతిక వనరులను పాఠశాలలకు అందుబాటులోకి తెచ్చిందని, వాటిని సమర్థవంతంగా వినియోగించి, గుణాత్మక విద్య అందించాలని ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలను తొలగించి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఎంపీడీఓ వేదవతి, ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, సర్పంచ్ కె. విజయ, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




