Palakurthi: విద్యుదాఘాతంతో యువ కౌలు రైతు మృతి వావిలాలలో విషాదం

Palakurthi: పాలకుర్తి మండలం వావిలాలలో విద్యుదాఘాతంతో కౌలు రైతు ఉపేందర్ మృతి చెందాడు.

S MAHENDER, PALAKURTHI
Published on: 2 Sept 2026 11:11 PM IST
Palakurthi
X

Palakurthi: విద్యుదాఘాతంతో యువ కౌలు రైతు మృతి వావిలాలలో విషాదం

పాలకుర్తి: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. కౌలు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆ యువ రైతును విద్యుత్ తీగలు కాలయముడై మింగేశాయి. పాలకుర్తి మండల పరిధిలోని వావిలాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి.

వావిలాల ​గ్రామానికి చెందిన అనపర్తి ఉపేందర్ (31) వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాడు. అతనికి భార్య కొడుకు కూతురు ఉన్నారు..జీవనోపాధి కోసం గ్రామంలోని కొందరి వద్ద భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాడు. పంటకు నీరు పెట్టే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు.

​కరెంట్ షాక్ తీవ్రత బలంగా ఉండటంతో ఉపేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తోటి రైతులు గమనించి వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే ఉపేందర్ విగతజీవిగా పడి ఉండటం చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

​చేతికందివచ్చిన యువకుడు కళ్లముందే విగతజీవిగా మారడంతో వావిలాల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఉపేందర్ ఆకస్మిక మరణంతో ఆ నిరుపేద కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు, తోటి రైతులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story