Parkal: దీపావళి వేళ కిటకిటలాడిన పరకాల మార్కెట్

Parkal: దీపావళి పండుగ సందర్భంగా పరకాల ప్రధాన మార్కెట్ కిటకిటలాడింది. పూజా సామగ్రి, మట్టి ప్రమిదలు, టపాసుల కొనుగోళ్లతో మార్కెట్ సందడిగా మారింది.

M PRABHAKAR, PARAKAL
Published on: 8 Nov 2026 2:33 PM IST
Parkal
X

Parkal: దీపావళి వేళ కిటకిటలాడిన పరకాల మార్కెట్

పరకాల: పరకాల దీపావళి పండుగ సందర్భంగా పరకాల ప్రధాన మార్కెట్ ఆదివారం కిటకిటలాడింది. పండుగ సామాగ్రి కొనుగోలు కోసం ఉదయం నుంచే ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్‌కు తరలివచ్చారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కుటుంబాలతో కలిసి వచ్చి షాపింగ్ చేశారు.

కేదారేశ్వర వ్రతం, లక్ష్మీ పూజల కోసం మట్టి ప్రమిదలు, మట్టి కుండలు, వెదురు బుట్టలు, తడికలు, గుమ్మడికాయలు, పూజా సామాగ్రిని ప్రజలు కొనుగోలు చేశారు. అలాగే కొత్త బట్టలు, బాణాసంచా, స్వీట్లు, పండ్లు, పూలు కొనేందుకు దుకాణాల వద్ద బారులు తీరారు. వ్యాపారులు కూడా దీపావళి స్పెషల్‌గా దుకాణాలను రంగురంగుల లైట్లు, పూలతో అందంగా అలంకరించారు.

మార్కెట్‌కు జనం పోటెత్తడంతో ప్రధాన రహదారిలో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రజల రద్దీతో మార్కెట్‌లో అడుగు పెట్టడానికి కూడా స్థలం లేకుండా పోయింది. అయినప్పటికీ పండుగ ఉత్సాహంతో ప్రజలు సంతోషంగా షాపింగ్ చేశారు. చిరు వ్యాపారులు కూడా మంచి వ్యాపారం జరగడంతో ఆనందం వ్యక్తం చేశారు.

పరకాల మార్కెట్‌లో గత రెండు రోజులుగా ఇదే రద్దీ కొనసాగుతోందని స్థానిక వ్యాపారులు తెలిపారు. దీపావళి పండుగకు మరో రోజు మాత్రమే ఉండటంతో సోమవారం కూడా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL