Parkal: పరకాల వృద్ధురాలి హత్య కేసు ఛేదన: నిందితుడి అరెస్ట్!

Parkal: పరకాల ఆకులవాడలో వృద్ధురాలి హత్య కేసు ఛేదన నిందితుడు నేరెళ్ల రమేష్ అరెస్ట్ 2 బంగారు పుస్తెలు, ఇనుపరాడ్ స్వాధీనం సీఐ ప్రవీణ్ బృందాన్ని అభినందించిన వరంగల్ సీపీ.

M PRABHAKAR, PARAKAL
Published on: 3 Oct 2026 9:37 PM IST
Parkal
X

Parkal: పరకాల వృద్ధురాలి హత్య కేసు ఛేదన: నిందితుడి అరెస్ట్!

పరకాల, అక్టోబర్ 3: పరకాల పట్టణంలోని ఆకులవాడలో వృద్ధురాలిని హత్య చేసి దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పరకాల ఇన్స్పెక్టర్ A. ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... గత నెల 30.09.2026న అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఆకులవాడలో ఒంటరిగా నివసిస్తున్న ఇద్దరు వృద్ధ మహిళల ఇంట్లోకి నిందితుడు పైకప్పు ద్వారా ప్రవేశించాడు. అతన్ని చూసి వారు కేకలు వేయడంతో పక్కనే ఉన్న ఇనుప రాడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో కోడెల సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా, కోడెల లసుమక్క తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్న 2 బంగారు పుస్తెలు, వెయ్యి రూపాయల నగదు దొంగిలించి ఇనుపరాడ్ తో సహా పరారయ్యాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఈ రోజు (03.10.2026) వెల్లంపల్లి రోడ్డులోని మున్సిపాలిటీ కార్యాలయం వెళ్లే దారిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో అతడిని పట్టుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.

నిందితుడిని నేరెళ్ల రమేష్, తండ్రి సదయ్య, వయస్సు 38 సం., కులం రజక, వృత్తి సెంట్రింగ్ పని, నివాసం రాంనగర్, పరకాల గా గుర్తించారు. విచారణలో - తాగుడుకు బానిసైన తనను భార్య వదిలి వెళ్లడంతో చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డానని, గుళ్లలో, ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నానని నేరం అంగీకరించాడు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

పంచనామా సమక్షంలో నిందితుడి వద్ద నుండి సుమారు 2 గ్రాముల బరువు గల రెండు బంగారు పుస్తెలు (విలువ సుమారు రూ. 30,000), అతని ఇంటి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలు ఉన్న ఆకుపచ్చ రంగు షర్ట్, నీలం రంగు జీన్స్ ప్యాంట్ స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ci ప్రవీణ్ కుమార్, ఎస్సైలు పవన్, రఘుపతిని ఏసీపీ సతీష్ బాబూ అభినందించారు. వారికి తగిన రివార్డు అందించనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL