Mulugu: నీటి లభ్యతకు అనుగుణంగా రబీ సాగు ప్రణాళిక: సీఎస్ సంజయ్ జాజు
Mulugu: రబీ 2026-27 సాగు ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లలో రూ.500 బోనస్, పాఠశాలల్లో 90% హాజరు, భూసేకరణపై సీఎస్ సంజయ్ జాజు కలెక్టర్లతో సమీక్షించారు.
Mulugu: నీటి లభ్యతకు అనుగుణంగా రబీ సాగు ప్రణాళిక: సీఎస్ సంజయ్ జాజు
Mulugu: రానున్న రబీ 2026-27 సీజన్లో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించాలని, ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లు, విద్యాశాఖ, భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణ, వికసిత్ భారత్ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరికి బదులుగా ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. సూక్ష్మ సేద్య విధానాలు, పంటల వైవిధ్యీకరణ, ఖరీఫ్ పంటల ఉత్పాదకత పెంపు, రైతు ఐడీ నమోదు, కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు నష్టం వాటిల్లకుండా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రైవేటు మార్కెట్లో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు కనీస మద్దతు ధరతో పాటు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధంగా ఉంచడంతో పాటు రైతుల వివరాల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని, ధాన్యం సేకరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
విద్యాశాఖపై సమీక్షిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది హాజరును ఎఫ్ఆర్ఎస్ ద్వారా పర్యవేక్షించాలని, విద్యార్థుల హాజరు కనీసం 90 శాతం ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును సమీక్షిస్తూ విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి డిజిటల్ అభ్యసన వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
రూసా 2.0, పీఎం ఉషా పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 41 పనుల్లో 8 పనులు పూర్తికాగా, మరో 33 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మంజూరైన నిధుల్లో 41 శాతం మాత్రమే ఖర్చు చేసినందున మిగిలిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమగ్ర శిక్ష అభియాన్, పీఎం శ్రీ పథకాల నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.11 వేల కోట్ల వ్యయంతో 87 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు రూ.625 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఆయా నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షించి వేగవంతం చేయాలని సూచించారు. అదేవిధంగా రూ.1,108 కోట్లతో మంజూరైన 115 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణకు అవసరమైన నిధులను కలెక్టర్ల వద్ద అందుబాటులో ఉంచామని, అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
గ్రామాలు, పట్టణాల్లో వీధి కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వీధి కుక్కలను గుర్తించి నిబంధనల ప్రకారం పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.
వికసిత్ భారత్ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో నీటి సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నీటి నిల్వలు, భూగర్భ జలాల పెంపునకు దోహదపడే పనులను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. కాలువలను శుభ్రపరిచి అవసరమైన పనులను పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఆర్డీవో కృష్ణవేణి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




