Mulugu: ములుగు జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు ప్రణాళికా శిక్షణ!
Mulugu: ములుగు జిల్లాలో గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించాలని అదనపు కలెక్టర్ సంపత్ రావు సూచించారు.
Mulugu: ములుగు జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు ప్రణాళికా శిక్షణ!
Mulugu: గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా స్థానిక అవసరాలకు అనుగుణంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావు సంబంధిత అధికారులకు సూచించారు.
శనివారం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులకు వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక రూపకల్పనపై రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
మొదటి విడతలో ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాలు, రెండవ విడతలో మల్లంపల్లి, ములుగు, వెంకటాపూర్, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాలకు చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. శిక్షణ పొందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు సెప్టెంబర్ 27 నుంచి 30వ తేదీ వరకు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
గ్రామ అవసరాలను గుర్తించి, లేబర్ బడ్జెట్‌కు అనుగుణంగా పనులను ఎంపిక చేసి షెల్ఫ్ ఆఫ్ వర్క్స్‌ను రూపొందించాలన్నారు. పనుల ఎంపికలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సిద్ధం చేసిన ప్రణాళికపై అక్టోబర్ 2న గ్రామ పంచాయతీ సమావేశంలో తీర్మానం చేసి, ఆమోదం కోసం జిల్లా కలెక్టర్‌కు పంపించాలని తెలిపారు.
వీబీ–జీ రామ్‌జీ పరిధిలో గుర్తించిన 375 పనుల్లో గ్రామానికి అవసరమైన వాటిని ఎంపిక చేసుకోవచ్చని వివరించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అక్టోబర్ 2 నుంచి 2027 జూన్ 30 వరకు చేపట్టాల్సిన పనులన్నింటినీ ముందుగానే ప్రణాళికలో పొందుపరచాలని తెలిపారు.
వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక రూపకల్పనపై ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు, కన్వర్జెన్స్ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు, వీబీ–జీ రామ్‌జీ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ప్రణాళికలను సమర్థంగా అమలు చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత గడువులో సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో రవీందర్, డీపీఓ వెంకయ్య, ఏపీడీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




