Mulugu: నిరుపేద కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించాలి: దివ్య

Mulugu: నిరుపేదలకు స్థిరమైన జీవనోపాధి, మిర్చి, ఇప్పపువ్వు యూనిట్లు, నవంబర్ 19న చీరల పంపిణీపై పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ ములుగు అధికారులతో సమీక్షించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 13 Nov 2026 11:07 PM IST
Mulugu
X

Mulugu: నిరుపేద కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించాలి: దివ్య

Mulugu: నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించి, ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం హైదరాబాద్ నుంచి తెలంగాణ సమ్మిళిత జీవనోపాధుల కార్యక్రమం అమలుపై ములుగు జిల్లా అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఎనిమిది మండలాల పరిధిలో టీజీఐఎల్‌పీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రాడ్యుయేషన్ అప్రోచ్ విధానం ద్వారా గ్రామాల్లో అత్యంత నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, ఆహార కిట్లు, అవసరమైన శిక్షణ అందించడంతో పాటు జీవనోపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిరుపేద కుటుంబాలకు ఉపాధి కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీబీ–జీ రామ్ జీ పథకం కింద అర్హులైన కుటుంబాలన్నింటికీ జాబ్‌కార్డులు అందించి, అవసరమైన పనిదినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

టీజీఐఎల్‌పీ కార్యక్రమంలో భాగంగా పనిచేస్తున్న కోచ్‌లకు అవసరమైన శిక్షణ అందించాలన్నారు. లబ్ధిదారులకు కల్పించిన జీవనోపాధుల నిర్వహణ, పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వారి ఆదాయ వివరాలను నమోదు చేస్తూ, ఆర్థిక పరిస్థితిలో వస్తున్న మార్పులను పరిశీలించాలన్నారు. లబ్ధిదారులకు ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ అందించి, పొదుపు అలవాట్లను పెంపొందించాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,500 వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ములుగు జిల్లాలో మిర్చి, ఇప్పపువ్వు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, సంబంధిత నిపుణుల సహకారంతో ప్రణాళికలు రూపొందించాలన్నారు.

లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసే ప్రదేశాల్లో ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అర్హత ఉన్నప్పటికీ ఎంపిక కాని వారు తమ వినతులను సమర్పించేందుకు అవకాశం కల్పించాలని, ఆయా దరఖాస్తులను నిబంధనల మేరకు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఎంపిక కాని వారు ఎంపీడీవో వద్ద పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకోవచ్చని, అక్కడ పరిష్కారం లభించని పక్షంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి లేదా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరూ కార్యక్రమ ప్రయోజనాలకు దూరం కాకుండా చూడాలన్నారు.

నవంబర్ 19న స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు అర్హులైన మహిళలందరికీ చీరల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. రేషన్‌కార్డుల వివరాల ఆధారంగా పంపిణీకి పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అందుబాటులో ఉన్న సమయం తక్కువగా ఉన్నందున ముందస్తుగానే చీరలను మండలాలకు, అక్కడి నుంచి మారుమూల గ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో అందుబాటులోకి వచ్చిన చీరలు వర్షానికి తడవకుండా, ఎలాంటి నష్టం జరగకుండా సురక్షితంగా నిల్వ చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ, టీజీఐఎల్‌పీ కార్యక్రమం అమలవుతున్న రెండు మండలాలకే పరిమితం కాకుండా జిల్లాలోని మొత్తం పది మండలాల్లో జాబ్‌కార్డు మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి జాబ్‌కార్డు అందించడంతో పాటు వివాహాల అనంతరం ఏర్పడిన కొత్త కుటుంబాలు, ఉపాధి పనుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించారు. రానున్న పది రోజుల్లో జాబ్‌కార్డుల వివరాల నవీకరణతో పాటు కొత్త జాబ్‌కార్డుల మంజూరు ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.

ప్రస్తుతం వీబీ–జీ రామ్ జీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో సగటున 41 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు. గురువారం జిల్లాలోని ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించి, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. బావులు, నీటి నిల్వ కుంటలు, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణానికి లక్ష్యాలను నిర్దేశించినట్లు వివరించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పనుల పురోగతిని సమీక్షిస్తున్నామని, రానున్న ఒకటి నుంచి రెండు నెలల్లో గణనీయమైన పురోగతి సాధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త జాబ్‌కార్డుల మంజూరుతో ఉపాధి పనుల్లో పాల్గొనే వారి సంఖ్య మరింత పెరుగుతుందన్నారు.

రేషన్‌కార్డుల వివరాల నవీకరణ, ఆరోగ్య ఉపకేంద్రాల ప్రణాళికకు సంబంధించిన సమస్యలను ఆయా శాఖల అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. సోమవారం కోచ్‌లతో సమావేశం నిర్వహించి, క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి వివరాలు తెలుసుకుంటామని, అనంతరం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో చర్చించి పరిష్కార చర్యలు చేపడతామని వివరించారు.

జిల్లాలో ఇప్పపువ్వుతో పాటు ఇతర ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలు, మార్కెటింగ్ అవకాశాలు, వినియోగదారుల డిమాండ్ తదితర అంశాలపై అధ్యయనం చేసి, కార్యాచరణ రూపొందిస్తామని కమిషనర్‌కు వివరించారు.

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా లబ్ధిదారుల ఆసక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. కంప్యూటర్ పరిజ్ఞానం పొందేందుకు ఆసక్తి చూపుతున్న లబ్ధిదారులను గుర్తించి, ఫొటోకాపీ సేవలకే పరిమితం కాకుండా ప్రింటింగ్ రంగంలోనూ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

టీజీఐఎల్‌పీ కార్యక్రమం కింద నిరుపేద కుటుంబాలకు అందిస్తున్న ఆహార కిట్లపై లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వివరించారు. 20కి పైగా రకాల ఆహార పదార్థాలతో కూడిన కిట్లు కుటుంబాలకు సమతుల్య పౌష్టికాహారం అందించేందుకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు.

మేడారం ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వివరించారు. మేడారం జాతర, సమ్మక్క–సారలమ్మలకు సంబంధించిన స్మారక వస్తువుల తయారీలో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఫ్రిజ్ మాగ్నెట్లు, వెదురు హస్తకళా వస్తువులు, దేవతల చిత్రాలతో కూడిన టీషర్టులు, టోపీలు, కీచైన్లు, కాఫీ మగ్గులు తదితర వస్తువులను స్థానిక మహిళలతో తయారు చేయిస్తున్నట్లు వివరించారు. వీటి ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు.

యువజన శిక్షణ కేంద్రంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, శిక్షణ కేంద్రానికి వచ్చి శిక్షణ పొందలేని మహిళల కోసం ఇతర మండలాలు, గ్రామాల్లోనే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.

ఇప్పపువ్వు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో చర్చిస్తామని, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటామని వివరించారు. జిల్లాలో పసుపు ప్రాసెసింగ్‌కు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారని, అన్ని అవకాశాలను పరిశీలించి జీవనోపాధి కల్పనకు చర్యలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎం. సంపత్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.