Maripeda: కొబ్బరి బొండాల మాటున పశువుల అక్రమ రవాణా గుట్టురట్టు
Maripeda: కొబ్బరి బొండాల మాటున అనకాపల్లి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 8 పశువులను మరిపెడ పోలీసులు తనిఖీల్లో పట్టుకుని వాహనాన్ని సీజ్ చేశారు.
Maripeda: కొబ్బరి బొండాల మాటున పశువుల అక్రమ రవాణా గుట్టురట్టు
మరిపెడ: సినిమాల్లో కనిపించే స్మగ్లింగ్ సన్నివేశాలను తలపించేలా పశువుల అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొబ్బరి బొండాల మాటున పశువులను తరలిస్తున్న అక్రమ దందాను మరిపెడ పోలీసులు తనిఖీల్లో గుర్తించారు. నంబర్ ప్లేట్ లేని టాటా ట్రాలీ వాహనంలో ఎనిమిది పశువులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మరిపెడ పోలీసులకు నంబర్ ప్లేట్ లేని టాటా ట్రాలీ అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కొబ్బరి బొండాల మాటున ఆరు ఆవులు, రెండు కోడెగిత్తలు ఉన్నట్లు గుర్తించారు. పశువుల కాళ్లు, మెడకు తాళ్లు కట్టి కదలలేని స్థితిలో తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వాటిని రక్షించి, పశువైద్యుల ద్వారా చికిత్స అందించారు.
అనకాపల్లి నుంచి హైదరాబాద్కు తరలింపు?**
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లికి చెందిన గొర్ల శివ, యలమచిలీ శివ, బంగారి లచ్చన్న అనే వ్యక్తులు పశువులను కొబ్బరి బొండాల మాటున హైదరాబాద్లోని కబేళాలకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. గత కొంతకాలంగా ఇదే తరహాలో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు నిందితులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
*వాహనం సీజ్.. నిందితులపై కేసులు*
ఈ ఘటనలో పశువుల అక్రమ రవాణాకు ఉపయోగించిన టాటా ట్రాలీని పోలీసులు సీజ్ చేశారు. పశువుల అక్రమ రవాణా, వధకు సంబంధించిన చట్టాల కింద నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెట్రోలింగ్ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి మూగజీవాలను రక్షించిన మరిపెడ పోలీసుల చర్యపై స్థానికంగా చర్చ జరుగుతోంది.




