Gudur: గూడూరు హాస్టల్‌లో దారుణం.. విద్యార్థులను కొరుకుతున్న ఎలుకలు!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రభుత్వ హాస్టల్‌లో ఎలుకల దాడితో భయంతో వణికిపోతున్న విద్యార్థులు. హాస్టల్‌ను పరిశీలించి చర్యలు చేపట్టిన తహసిల్దార్.

B NARASIMHA, GUDUR
Published on: 5 Oct 2026 12:06 PM IST
Gudur
X

Gudur: గూడూరు హాస్టల్‌లో దారుణం.. విద్యార్థులను కొరుకుతున్న ఎలుకలు!

Gudur: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ విద్యార్థుల హాస్టల్‌లో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి వేళల్లో నిద్రిస్తున్న విద్యార్థులపై ఎలుకలు దాడి చేస్తూ, వారిని కొరుకుతున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి.

హాస్టల్‌లో పారిశుధ్యం పూర్తిగా మృగ్యమవ్వడం, పరిసరాలు మురికికూపంగా మారడంతో ఎలుకల సంచారం విపరీతంగా పెరిగింది. చీకటి పడితే చాలు ఎలుకలు గుంపులు గుంపులుగా వచ్చి విద్యార్థుల కాళ్లు, చేతులు కొరుకుతున్నాయని విద్యార్థులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతూ, ఎప్పుడు ఏ ఎలుక దాడి చేస్తుందోనని భయంతో వణికిపోతున్నారు.

హాస్టల్ నిర్వహణను పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆరోగ్య భద్రతకు ఏమాత్రం గ్యారెంటీ లేని ఈ వసతి గృహంలో తమ పిల్లలను ఎలా ఉంచాలని ప్రశ్నిస్తున్నారు.

హాస్టల్ ను సందర్శించిన తహసిల్దార్

హాస్టల్లో ఎలుకల విడద తెలుసుకున్న గూడూరు తహసిల్దార్ నాగభవాని తక్షణమే హాస్టల్లో సందర్శించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎలకల బెడదను తక్షణమే నివారించడానికి పరిష్కారం చూపాలని పై అధికారులను సూచించారు. ఎలుకలు కరిచిన విద్యార్థులను స్థానిక ప్రభుత్వ డాక్టర్లచే చికిత్స చేయించారు.

తక్షణమే స్పందించాలి

సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి గూడూరు హాస్టల్‌లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని, ఎలుకల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని, విద్యార్థులకు సరైన వైద్య సదుపాయాలు అందించి రక్షణ కల్పించాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR