Palakurthi: పాలకుర్తి గురుకులంలో 14 మందిని కొరికిన ఎలుకలు
Palakurthi: పాలకుర్తి సాంఘిక సంక్షేమ గురుకులంలో 14 మంది విద్యార్థినులను ఎలుకలు కొరకడంతో తీవ్ర కలకలం రేగింది. పరామర్శకు వెళ్లిన ఎర్రబెల్లిని పోలీసులు అడ్డుకున్నారు.
Palakurthi: పాలకుర్తి గురుకులంలో 14 మందిని కొరికిన ఎలుకలు
జనగామ: జనగామ జిల్లా పాలకుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో తీవ్ర కలకలం చెలరేగింది. ఏకంగా 14 మంది విద్యార్థినులను ఎలుకలు కొరకడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... సోషల్ వెల్ఫేర్ రాష్ట్ర సెక్రటరీతో ఫోన్లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్లిన ఎర్రబెల్లిని పోలీసులు పాఠశాల గేటు వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గురుకుల పాఠశాల గేటు ఎదుటే బైఠాయించి ధర్నాకు దిగారు.
పాలకుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. రాత్రి వేళ హాస్టల్లో నిద్రిస్తున్న 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడంతో తీవ్ర అలజడి రేగింది. ఇంత పెద్ద ఘటన జరిగినా కనీసం బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విద్యార్థినులను పరామర్శించేందుకు పాఠశాలకు రాగా, పోలీసులు ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆయన గేటు ముందే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
"హాస్టళ్లలో కనీస వసతులు కల్పించకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏకంగా 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరుస్తుంటే అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారు? గతంలో ఇదే పాఠశాలలో వాచ్మెన్కు పాము కరిచిన ఘటన జరిగింది.
అయినా అధికారుల్లో ఎలాంటి మార్పు రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేం స్వయంగా ఏడాదికి రెండుసార్లు పాఠశాలలకు వెళ్లి అన్ని వసతులూ కల్పించేవాళ్లం. కేసీఆర్ గారి పాలనలో ఇలాంటి దారుణాలు ఎప్పుడూ జరగలేదు. పిల్లలకు ధైర్యం చెప్పడానికి వస్తే మమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటి? రాష్ట్రంలో ఇంత దుర్మార్గపు పాలన కొనసాగుతోంది..."
విద్యార్థినుల భద్రతను గాలికొదిలేసి, ప్రశ్నించే వారిని అడ్డుకోవడం సిగ్గుచేటని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం గురుకులాల్లో కనీస సౌకర్యాలు కల్పించి, విద్యార్థుల ఆరోగ్య భద్రతకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.




