Hanamkonda: బయట డాక్టర్ల బోర్డులు.. లోపల నకిలీ వైద్యుల దందా!
Hanamkonda: హనుమకొండలో అర్హత కలిగిన వైద్యుల బోర్డుల చాటున నకిలీ వైద్యులు చికిత్సలు చేస్తున్న దందాను TGMC ఆకస్మిక తనిఖీలు బట్టబయలు చేశాయి.
Hanamkonda: బయట డాక్టర్ల బోర్డులు.. లోపల నకిలీ వైద్యుల దందా!
హనుమకొండ: ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతూ, అర్హత కలిగిన వైద్యుల పేర్లు, మెడికల్ రిజిస్ట్రేషన్ నంబర్లను అడ్డుపెట్టుకుని అర్హత లేని వ్యక్తులతో వైద్య చికిత్సలు అందిస్తున్న క్లినిక్‌లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) కొరడా ఝళిపించింది.
నవంబర్ 12, గురువారం సాయంత్రం హనుమకొండలోని రెడ్డి కాలనీ, రాయపుర, ఇందిరా నగర్ ప్రాంతంలో TGMC వైద్య బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.
ఈ తనిఖీల్లో పలు క్లినిక్‌లలో అధికారులు సైతం విస్తుపోయే వైద్య కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి.
శ్రీలక్ష్మి క్లినిక్:
బయట వైద్యుల పేర్లు.. లోపల వేరే వ్యక్తులతో వైద్యం!
ఇందిరనగర్‌లోని శ్రీలక్ష్మి ఫార్మసీ ను బి. కరుణాకర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తనిఖీల సందర్భంగా గుర్తించారు. అదే భవనంలో శ్రీలక్ష్మి ఫార్మసీ వెనుక గదిలో అనుమతి లేకుండా శ్రీలక్ష్మి క్లినిక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
ఈ క్లినిక్ బయట ఏర్పాటు చేసిన బోర్డుపై డా. B. మోహన కృష్ణ MD జనరల్ మెడిసిన్,
డా. ఎన్. అవినాష్ MBBS పేర్లు, వారి మెడికల్ రిజిస్ట్రేషన్ నంబర్లు ప్రదర్శిస్తున్నారు. అయితే, లోపల రోగులకు చికిత్స అందిస్తున్న
ఆర్.కె. రావు సుమారు 50–55 ఏళ్ల వ్యక్తిని హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్యుడిగా రోగులకు పరిచయం చేస్తూ చికిత్సలు అందిస్తున్నట్లు తనిఖీల సందర్భంగా గుర్తించారు.
విచారణ లొ వ్యక్తి ఇంటర్మీడియట్ కూడా ఉత్తీర్ణత సాధించలేదని, గతంలో హైదరాబాద్ లొ ఒక డాక్టర్ వద్ద కాంపౌండర్‌గా పనిచేసినట్లు సమాచారం.
రోగులకు హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ అని మొదట చెప్పడం తరువాత అధికారులు
వచ్చిన తరువాత అసలు విషయం బయటకు రావడం తో
అక్కడ రోగుల సహాయకులు అధికారుల సమక్షంలోనే క్లినిక్ నిర్వాహకుడిని, సదరు వ్యక్తిని ప్రశ్నించారు.
ఈ క్లినిక్ కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి ఎటువంటి అనుమతి లేదు మరియు బెడ్స్ కూడా ఏర్పాటు చేసారు.
ప్రణతి క్లినిక్: అనుమతి ఒకరి పేరుతో.. వైద్యం మరొకరి చేతిలో!
అదే ప్రాంతంలోని ప్రణతి క్లినిక్‌కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DMHO) నుంచి డా. కె. సుష్మిత పేరుతో అనుమతి ఉన్నట్లు తెలిసింది. అది కూడా గడువు ముగిసింది .
అయితే, ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి క్లినిక్‌కు వచ్చి వైద్య సేవలు అందించడం లేదని ఫిర్యాదులు కౌన్సిల్ కి వచ్చాయి.
ఫార్మసీ విద్యను అభ్యసించిన ఎన్. సందీప్ అనే వ్యక్తి తానే వైద్యుడినని రోగులకు పరిచయం చేసుకుంటూ వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించి తగు సాక్షాలు సేకరించారు.
అనుమతి పొందిన వైద్యురాలు స్వయంగా అందుబాటులో లేకుండా, అర్హత లేని వ్యక్తి వైద్యుడిగా వ్యవహరించడం తీవ్రమైన అంశమని మరియు మెడికల్ఎతిక్స్ కోడ్ ఉల్లంఘన అని TGMC పేర్కొంది.
సిద్ధార్థ క్లినిక్:
గతంలో కేసులు నమోదైనా మారని పరిస్థితి!
ఇదే రెడ్డి కాలనీ, ఇందిరనగర్ పరిసరాల్లో గతంలో సిద్ధార్థ క్లినిక్ నిర్వహణకు సంబంధించి విజయ, మరో క్లినిక్ నిర్వాహకుడు వేణు అనే వ్యక్తులపై తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ అండ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ యాక్ట్ (TSMPR Act) మరియు వర్తించే ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసారు .
ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు TGMC తరఫున లేఖలు కూడా పంపించినప్పటికీ, తగిన చర్యలు తీసుకోలేదు.
తాజాగా అదే ప్రాంతంలో విజయ, వేణు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్న కేంద్రాలపై కూడా తనిఖీలు మరోసారి నిర్వహించారు. అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తూ, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, నొప్పి నివారణ ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు అధిక మోతాదులో ఇస్తున్నారని టీజీఎంసీ అధికార బృందం గుర్తించింది.
బోర్డుపై పేర్లున్న వైద్యులకూ TGMC నోటీసులు!
క్లినిక్ బయట అర్హత కలిగిన వైద్యుల పేర్లు, మెడికల్ రిజిస్ట్రేషన్ నంబర్లు ప్రదర్శిస్తూ, లోపల అర్హత లేని వ్యక్తులతో వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో సంబంధిత వైద్యులకు నోటీసులు జారీ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో నకిలీ వైద్యులను ప్రోత్సహిస్తున్న
డా. కె. సుష్మిత,
డా. మోహన కృష్ణ,
డా. ఎన్ . అవినాష్‌లకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయనున్నట్లు కౌన్సిల్ తెలిపింది. క్లినిక్ నిర్వహణలో వారి పాత్ర, అనుమతి, వైద్య సేవల పర్యవేక్షణ వంటి అంశాలపై వివరణ తీసుకుని, బాధ్యత నిర్ధారణ అనంతరం వర్తించే NMC ఎతిక్స్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.
ప్రజారోగ్యంతో చెలగాటం ఆడితే సహించేది లేదు: TGMC హెచ్చరిక
అర్హత లేని వ్యక్తులు వైద్యులుగా చలామణి అవుతూ ప్రజలకు చికిత్సలు అందించడం అత్యంత ప్రమాదకరం. విచక్షణారహితంగా స్టెరాయిడ్లు, నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కిడ్నీ సమస్యలు, ఇతర అవయవాలపై దుష్ప్రభావాలు, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వంటి తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే నకిలీ వైద్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ హెచ్చరించింది.
రాష్ట్రవ్యాప్తంగా నకిలీ వైద్యులు, అనధికారిక క్లినిక్‌లపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని,
నకిలీ వైద్యుల మనుగడ కోసం ఆలోచిస్తే అది ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడమే అవుతుందని, సమాజానికి నకిలీ వైద్యులు అయిన RMP లతో ప్రమాదం ఉంది అని
ఆధారాలతో కూడిన ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీజీఎంసీ స్పష్టం చేసింది.
ప్రజలకు TGMC విజ్ఞప్తి:
క్లినిక్ బయట పెద్ద పెద్ద బోర్డులు, ప్రముఖ వైద్యుల పేర్లు, రిజిస్ట్రేషన్ నంబర్లు ఉన్నంత మాత్రాన అక్కడ చికిత్స చేస్తున్న వ్యక్తి అర్హత కలిగిన వైద్యుడని నమ్మవద్దు. వాస్తవంగా చికిత్స అందిస్తున్న వైద్యుడి అర్హత, రిజిస్ట్రేషన్ వివరాలను తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి.
నకిలీ వైద్యుల (RMP) ల వైద్యం తో తొలి దశలో తగ్గాల్సిన చాలా వరకు జబ్బులు ముదిరిన దశలో ప్రైవేట్ హాస్పిటల్స్ అడ్మిట్ అవడం వల్ల ప్రజలకు ఆర్ధిక భారం అవడం తో పాటు ప్రాణ ప్రమాదాలు కూడా అవుతున్నాయి, కొందరు RMP లు PRO ల ద్వారా జబ్బు ముదిరిన రోగులను ప్రైవేట్ ఆసుత్రులకు పంపి యాజమాన్యం ని బెదిరించి పెద్ద ఎత్తున సొమ్ము కమిషన్లు పొదుతున్నట్లు సమాచారం వస్తున్నాయి.
నకిలీ వైద్యులు, అనధికారిక క్లినిక్‌లు, అర్హత లేని వ్యక్తుల వైద్య కార్యకలాపాలపై ప్రజలకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే
91543 82727 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని TGMC విజ్ఞప్తి చేసింది.
ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యం:
నకిలీ వైద్యానికి అడ్డుకట్ట వేయడంలో ప్రజలు మరియు నాయకులు, అధికారులు కూడా భాగస్వాములు కావాలి ఉదాసీనంగా ఉంటే ప్రజారోగ్యనికి పెను ప్రమాదం తప్పదని టీజీఎంసీ అభిప్రాయపడింది.
తనిఖీల్లో పాల్గొన్న అధికారులు
1. డా. వి. నరేష్ కుమార్ – సభ్యులు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్.
2. డా. కొలిపాక వెంకటస్వామి – కో-ఆప్టెడ్ సభ్యులు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్.
3. డా. మహమ్మద్ అన్వర్ మియా – వరంగల్ జిల్లా యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్, వరంగల్
4. డా.ఎస్. శిరీష్ కుమార్ – సెక్రటరీ, ఐ ఎం ఏ, వరంగల్.




