Warangal: కొండా సురేఖ హాజరైన వేడుకల పరిశీలనకు దూరంగా గుండు సుధారాణి!

Warangal: వరంగల్ ఉర్సు రంగలీలా మైదానంలో దసరా ఏర్పాట్లను కొండా సురేఖ పరిశీలించగా, కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

MD. AMEER, WARANGAL EAST
Published on: 6 Oct 2026 3:59 PM IST
Warangal
X

Warangal: కొండా సురేఖ హాజరైన వేడుకల పరిశీలనకు దూరంగా గుండు సుధారాణి!

వరంగల్: వరంగల్ ఉర్సు దసరా వేడుకల ఏర్పాట్ల సమయంలో రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. రంగలీలా మైదానంలో ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.

ఆమె వెంట జిల్లా కలెక్టర్ సత్య శారద, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అయితే కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్ గుండు సుధారాణి మరియు KUDA అధికారులు హాజరుకాకపోవడం గమనార్హం.

ఎమ్మెల్యే కొండా సురేఖ, KUDA చైర్‌పర్సన్ గుండు సుధారాణి మధ్య ఉన్న రాజకీయ విభేదాల వల్లే ఈ గైర్హాజరు జరిగిందనే ప్రచారం స్థానికంగా వేగంగా వ్యాపించింది. ఏటా వేలాది మంది భక్తులు హాజరయ్యే ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడటంతో ఉత్సవాల నిర్వహణపై ప్రజల్లో సందిగ్ధత నెలకొంది.

పండుగ ఏర్పాట్లలో రాజకీయ పంతాలు చూపడం సరికాదని, విభేదాలు ఏవైనా ఉంటే పార్టీ వేదికలకే పరిమితం చేయాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలందరూ వేడుకగా జరుపుకునే పండుగ ప్రాధాన్యతను గుర్తించి, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు సమన్వయంతో ఉర్సు దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతున్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST