Jangaon: విశ్వనాథపురంలో బెల్టుషాపును ప్రశ్నించిన సర్పంచ్‌పై దాడి!
Jangaon: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం విశ్వనాథపురంలో బెల్టుషాపును ప్రశ్నించిన మహిళా సర్పంచ్ యాదమ్మపై దాడికి పాల్పడ్డారు.
Jangaon: విశ్వనాథపురంలో బెల్టుషాపును ప్రశ్నించిన సర్పంచ్‌పై దాడి!
Jangaon: స్టేషన్ ఘనపూర్ మండలం విశ్వనాథపురం గ్రామంలో బెల్టుషాపు నిర్వాహకుడి ఆగడాలు శృతిమించాయి. గ్రామపంచాయతీ ఏకగ్రీవ తీర్మానాన్ని సైతం లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా మద్యం విక్రయిస్తూ, నిలదీసిన మహిళా సర్పంచ్ పైనే దాడికి తెగబడ్డ ఘటన కలకలం రేపింది.
గ్రామంలో బెల్టుషాపులు నిర్వహించవద్దని సర్పంచ్ గుర్రపు యాదమ్మ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో గ్రామస్తుల సహకారంతో తీర్మానం చేశారు. దీనికి కట్టుబడి గ్రామంలో ఉన్నవారంతా షాపులు మూసివేశారు. అయితే గ్రామానికి చెందిన ఓర్సు శ్రీను మాత్రం నిబంధనలను ఉల్లంఘించి కొత్తగా బెల్టుషాపు తెరిచి యథేచ్ఛగా మద్యం అమ్ముతున్నాడని ఆరోపించారు.
ఎన్నిసార్లు హెచ్చరించినా వినడం లేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం అక్రమ మద్యం విక్రయాలపై సమాచారం రావడంతో సర్పంచ్ యాదమ్మ గ్రామపంచాయతీ సిబ్బంది మధును ఫోటోలు తీయడానికి పంపారు. ఫోటోలు తీస్తున్న మధును ఓర్సు శ్రీను అసభ్య పదజాలంతో దూషించి బెదిరించాడని సిబ్బంది ఫిర్యాదు చేశారు.
దీంతో సర్పంచ్ యాదమ్మ స్వయంగా వెళ్లి నిలదీయగా ఓర్సు శ్రీను రెచ్చిపోయాడు. సర్పంచ్ ను కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడాడు. అనంతరం అతని తండ్రి, ముగ్గురు కొడుకులు నవీన్, ప్రవీణ్, రాజు, భార్య రజిత కలిసి సర్పంచ్ పై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన సర్పంచ్ భర్త ఎల్లయ్య, కొడుకు నరేష్ లపై కూడా దాడి చేశారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై సర్పంచ్ యాదమ్మ గురువారం స్టేషన్ ఘనపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




