Sirole: ఎల్నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

Sirole: సీరోల్ మండలం చింతపల్లిలో 'ఖేత్ బచావో అభియాన్' కార్యక్రమం. ఎల్నీనో ప్రభావం, ఆరుతడి పంటల సాగుపై రైతులకు వ్యవసాయ అధికారుల అవగాహన.

P PRABHAKAR, DORNAKAL
Published on: 12 Nov 2026 4:03 PM IST
Sirole
X

Sirole: ఎల్నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

సీరోల్: మండలంలోని చింతపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి ఛాయారాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు ఎల్నీనో ప్రభావం, నీటి సంరక్షణ, పంటల ఎంపికపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆత్మ చైర్మన్ నల్ల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్నీనో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో నీటి ఎద్దడి, విద్యుత్ కోతలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. రైతులు సమన్వయంతో వ్యవహరిస్తూ నీటి లభ్యతకు అనుగుణంగా సరైన పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కరోనా కష్టకాలాన్ని సమిష్టి కృషితో ఎదుర్కొన్నట్లే, ఎల్నీనో ప్రభావం వల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

తక్కువ నీటితో సాగు చేయగల పెసర, మినుము, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం మంచిదని పేర్కొన్నారు. అలాగే జొన్నలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.

చింతపల్లి సర్పంచ్ భిరావత్ వీరన్న మాట్లాడుతూ వ్యవసాయ నిపుణులు సూచించిన విధంగా రైతులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే పంట నష్టాలను గణనీయంగా అరికట్టవచ్చని తెలిపారు.

జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. విజయ్ చంద్ర మాట్లాడుతూ భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా ఎల్నీనో వంటి పరిస్థితులను కొంతవరకు అధిగమించవచ్చని అన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, కలుపు మందులు, పురుగుమందులను సూచించిన మోతాదులోనే ఉపయోగించడం అవసరమన్నారు.

పొలాల్లో పంట కుంటలను నిర్మించుకోవడం, అవసరాన్ని బట్టి తడులు ఇవ్వడం, నానో యూరియా, నానో డీఏపీ వినియోగం, పంట మార్పిడి, పప్పు దినుసులు, ఇతర అపరాల సాగు వంటి చర్యల ద్వారా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమం అనంతరం మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ పల్సెస్ పథకం కింద రైతులకు సబ్సిడీపై పెసర విత్తనాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఈ ఇరిగేషన్ జే. నిఖిలేందర్, ఏఈవోలు జీ. సురేష్, ఎం. భరత్, ఎం. రమేష్, విద్యుత్ శాఖ లైన్‌మన్, రెవెన్యూ, ఈజీఎస్, ఐకేపీ సిబ్బంది, సీసీలు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL