Gudur: బడికి డుమ్మా.. రాజకీయాల్లో బిజీ: ఉపాధ్యాయుల తీరు
Gudur: గూడూరు మండలంలోని గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్లో హాజరు వేసి రాజకీయాల్లో తిరుగుతున్నారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
Gudur: బడికి డుమ్మా.. రాజకీయాల్లో బిజీ: ఉపాధ్యాయుల తీరు
గూడూరు: విద్య బోధన అందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు బాధ్యతలను విస్మరించి రాజకీయ నాయకులుగా అవతారమెత్తుతున్నారు. పాఠశాల వేళల్లో విధులకు హాజరుకాకుండా ప్రజాసేవ పేరుతో సొంత పనులు, రాజకీయాల్లో హడావుడి చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ప్రభుత్వ గిరిజన పాఠశాలలో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరు ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హాజరు నమోదు చేసి.. జంప్!
మండలంలోని వంపు తండా,చిర్రకుంట కోయగూడెం, అయోధ్య పురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రాంపురం,బొద్దుగోండ చిల్లగండి తండా పాఠశాలలో పనిచేస్తున్న
ఉపాధ్యాయులు ఉదయాన్నే పాఠశాలకు వచ్చి ఎఫ్ఆర్ఎస్ యాప్లో ఫోటోలు అప్లోడ్ చేసి హాజరు నమోదు చేసుకుంటున్నారు. ఆ తర్వాతి క్షణమే పాఠశాలను, విద్యార్థులను గాలికి వదిలేసి వెళ్లిపోతున్నారు. గూడూరు కేంద్రంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులమని, రాజకీయ నాయకులమని చెప్పుకుంటూ రోజంతా హడావుడి చేస్తున్నారు. బడిలో పాఠాలు చెప్పాల్సిన సమయంలో స్థానిక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం.. సమాధానం చెప్పేందుకు నిరాకరణ
ఈ విషయంపై ఆందోళన చెందిన స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా స్థాయి అధికారులను కలిసి వివరణ కోరేందుకు ప్రయత్నించగా, అధికారులు సమాధానం చెప్పేందుకు నిరాకరించడం గమనార్హం. "వీరు అసలు ఉపాధ్యాయులా? లేక రాజకీయ నాయకులా?" అని మీడియాలో కథనాలు వచ్చినా, పత్రికల్లో వార్తలు ఊపందుకున్నా జిల్లా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సదరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ లేదా శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కూడా విచారణ జరిపి గిరిజన పాఠశాలలో విద్యాబోధన సక్రమంగా జరిగేలా చూడాలని స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.




