Warangal: మోడీ విధానాలతో సంక్షోభంలో రైతాంగం: పెద్దారపు రమేష్!
Warangal: మోడీ విధానాలతో రైతాంగం సంక్షోభంలో పడిందని ఎస్కేఎం కన్వీనర్ పెద్దారపు రమేష్ విమర్శించారు. నవంబర్ 26న నిరసనలు చేపట్టి, తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలని కోరారు.
Warangal: మోడీ విధానాలతో సంక్షోభంలో రైతాంగం: పెద్దారపు రమేష్!
వరంగల్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశనకర విధానాల వల్ల దేశీయ వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతాంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) రాష్ట్ర కన్వీనర్, అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 26న జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈరోజు వరంగల్‌లోని ఓంకార్ భవన్లో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో రైతు సంఘాల జిల్లా బాధ్యుల సమావేశం జిల్లా కన్వీనర్ కుసుంబా బాబురావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పెద్దారపు రమేష్ మాట్లాడుతూ, ఆరుగాలం కష్టపడి పంటలు పండించి సమాజ మనుగడకు అవసరమైన ఆహార ఉత్పత్తులను అందిస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వ విధానాలు ఆత్మహత్యల వైపు నెట్టివేస్తున్నాయని విమర్శించారు.
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతుల రుణాలను మాఫీ చేయడానికి ముందుకు రాని కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారీ వర్గాలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తూ దేశ సంపదను వారికి కట్టబెడుతోందని మండిపడ్డారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
ఐదేళ్ల క్రితం చారిత్రాత్మక ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చకపోవడం సిగ్గుచేటని అన్నారు. పైగా రైతులకు నష్టం కలిగించే విద్యుత్, విత్తన చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణమని విమర్శించారు.
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడి పంటల దిగుబడులు తగ్గిపోయాయని, పెట్టుబడులు కూడా తిరిగి రాక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం నామమాత్రంగా కొన్ని కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నందున తక్షణమే తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించి, రైతులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ, కొత్త పథకాన్ని తీసుకురావడం, పాత కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్‌ను అమలు చేయడం ద్వారా కూలీలు, కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, కూలీ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రైతులు, కార్మికులు, కూలీలు, ప్రజాస్వామికవాదులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
అనంతరం నవంబర్ 26న నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఎస్కేఎం జిల్లా కన్వీనర్లు చుక్క మొగిలి (ఏఐకేఎస్), సుధమల్ల భాస్కర్ (ఏఐకేఎస్ఎస్), జిల్లా నాయకులు ఊరటి హంసల్ రెడ్డి (తెలంగాణ రైతు సంఘం), మైదం పాణి (ఏఐయూకేఎస్), ఐతమ్ నాగేష్ (ఏఐకేఎఫ్) తదితరులు పాల్గొన్నారు.




