Mahabubabad: చదువుపై పూర్తి దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్!

Mahabubabad: విద్యార్థులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ శబరీష్ సూచించారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 2 Sept 2026 11:29 PM IST
Mahabubabad
X

Mahabubabad: చదువుపై పూర్తి దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్!

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మగూడెం ప్రభుత్వ గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు సైబర్ నేరాలు, మొబైల్ వినియోగం, వ్యక్తిగత భద్రత మరియు విద్యార్థుల భవిష్యత్తుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థినులతో నేరుగా మాట్లాడి పలు అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాల సంఖ్యతో పాటు వాటి రూపాలు కూడా మారుతున్నాయని, విద్యార్థులు సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్, అపరిచిత వ్యక్తులతో చాటింగ్ మరియు ఇతర ఆన్‌లైన్ కార్యకలాపాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు, పాస్‌వర్డ్‌లు, OTPలు వంటి సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులు, యాప్‌లు మరియు ఆన్‌లైన్ ఆఫర్లకు దూరంగా ఉండాలని తెలిపారు.

మొబైల్ ఫోన్‌ను అవసరానికి మించి ఉపయోగించడం వల్ల విద్యార్థుల చదువు, ఏకాగ్రత మరియు భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. మొబైల్‌ను జ్ఞానాన్ని పెంచుకునేందుకు ఉపయోగించుకోవాలని, సమయాన్ని వృథా చేసే సోషల్ మీడియా, రీల్స్, అనవసరమైన గేమ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.

విద్యార్థులు చదువుపై ఎలా దృష్టి పెట్టాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలి అనే అంశాలపై ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రతిరోజూ ఒక నిర్దిష్ట ప్రణాళికతో చదువుకోవాలని, అర్థం కాని విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని, ఇతరులతో తమను తాము పోల్చుకోకుండా తమ లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని తెలిపారు.

“వైఫల్యం విజయానికి ముగింపు కాదు.. విజయానికి వేసే తొలి అడుగు. ఒకసారి విఫలమయ్యామని నిరాశ చెందకుండా, ఆ వైఫల్యం నుంచి పాఠం నేర్చుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగాలి” అని విద్యార్థులకు సూచించారు. ఎలాంటి సమస్య ఎదురైనా భయపడి మౌనంగా ఉండవద్దని, “చీకటిలో దాక్కోకండి.. మీ గొంతును వినిపించండి. మీకు ఎదురయ్యే సమస్యను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురండి” అని ఎస్పీ తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురిచేసినా, సోషల్ మీడియాలో ఇబ్బందులు కలిగించినా, సైబర్ మోసానికి గురైనా వెంటనే నమ్మకమైన పెద్దలకు తెలియజేసి పోలీసులను సంప్రదించాలని సూచించారు.

విద్యార్థులు తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను గుర్తించి, మంచి లక్ష్యాలను ఏర్పరచుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎస్పీ ఆకాంక్షించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఇతర సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం రాబోయే గణేష్ ఉత్సవాల సందర్భంగా సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన “BE CYBER WISE – Lord Ganesha Teaches Us” అవగాహన పోస్టర్లను జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఆవిష్కరించారు.

గణేష్ ఉత్సవాల సందర్భంగా విరాళాల పేరుతో వచ్చే నకిలీ QR కోడ్‌లు, ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు, అనుమానాస్పద లింకులు, నకిలీ ఆన్‌లైన్ ఆఫర్లు తదితర వాటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. OTPలు, బ్యాంక్ ఖాతా వివరాలు, ATM/డెబిట్ కార్డు వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి రహస్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు వెల్లడించవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచించారు. సమయానికి ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ విద్యార్థినులతో నేరుగా ఇంటరాక్ట్ అవుతూ వారి సందేహాలను తెలుసుకుని, సైబర్ నేరాలు, మొబైల్ వినియోగం, చదువు, వ్యక్తిగత భద్రత తదితర అంశాలపై ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సైబర్ సెల్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story