Mulugu: గణేష్ నిమజ్జనానికి ములుగులో ప్రత్యేక పోలీస్ బందోబస్తు!
Mulugu: ములుగు జిల్లాలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక భద్రత. డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు పాటించాలని ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ ఆదేశం.
Mulugu: గణేష్ నిమజ్జనానికి ములుగులో ప్రత్యేక పోలీస్ బందోబస్తు!
Mulugu: ములుగు జిల్లాలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ములుగు జిల్లా పోలీస్ శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ కె. సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ తెలిపారు.
నిమజ్జన కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, విగ్రహాల ఊరేగింపులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పోలీస్ సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు.
నిమజ్జన ప్రాంతాల్లో చెరువులు, వాగులు, కాలువలు, ఇతర నీటి వనరుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా భక్త మండలి వారు,ఈత రాని వారు నీటిలోకి వెళ్లవద్దని సూచించారు. చిన్నారులను నిమజ్జన ప్రాంతాలకు తీసుకువచ్చే తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
నిమజ్జనం కోసం వచ్చే వాహనాలను నిర్దేశించిన మార్గాల్లోనే నడపాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా పోలీసులకు సహకరించాలని ఎస్పీ సూచించారు. ఊరేగింపు సమయంలో డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల విషయంలో నిబంధనలు పాటించాలని, బాణాసంచా కాల్చరాదు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించవద్దని తెలిపారు.
అదేవిధంగా విద్యుత్ హైటెన్షన్ తీగలు, విద్యుత్ స్తంభాలు, ప్రమాదకర ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ తీగలకు విగ్రహాలు లేదా ఇతర వస్తువులు తగలకుండా పోలీసులు నిర్దారించి అనుమతించబడిన దారిలో మాత్రమే తీసుకురావాలని సూచించారు.
గణేశ్ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని, ప్రజలు పోలీసులకు సహకరిస్తే నిమజ్జన కార్యక్రమాలను మరింత ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించవచ్చని ఎస్పీ తెలిపారు.
ములుగు జిల్లా ప్రజలందరూ పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు పాటిస్తూ గణేశ్ నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించాలని ఎస్పీ కోరారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా గణేశ్ నిమజ్జన వేడుకలను విజయవంతంగా నిర్వహించగలమని, ములుగు జిల్లా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.




